43 యేళ్ల హాలీవుడ్ నటుడు చాడ్విక్ బోస్‌మెన్ కన్నుమూత

హాలీవుడ్‌ బ్లాక్ బస్టర్స్ అవెంజర్స్‌, బ్లాంక్ పాంథర్ వంటి పలు సినిమాల్లో నటించిన హాలీవుడ్ నటుడు చాడ్విక్ బోస్‌మెన్ శుక్ర వారం కాన్సర్‌తో కన్నమూశారు. ఆయన వయసు 43 యేళ్లు. ఈయన అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని తన స్వగృహంలో కన్నుమూసారు. చనిపోయేటపుడు ఆయన భార్య కుటుంబ సభ్యులు దగ్గర ఉన్నారు. ఈయన గత కొన్నేళ్లుగా పెద్ద ప్రేగు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.

చాడ్విక్ మరణవార్తతో సినీలోకం దిగ్భ్రాంతికి గురైంది. అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డొమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ కూడా విచారం వ్యక్తం చేశారు. మంచి తెలివైన వాడు, స్నేహితుడు చిన్న వయస్సులో లోకాన్ని వీడాడంటూ ఆమె ట్వీట్ చేశారు. చాడ్విక్ చివరిసారిగా కమలా హారిస్‌కు మద్దతు ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా కమలాను జో బైడెన్ ప్రతిపాదించిన అనంతరం కమలాతో కలిసి ఉన్న ఫోటోను ట్విటర్ లో షేర్ చేస్తూ..ఆమెకు తన మద్దతు ప్రకటించాడు. బ్లాక్ పాంథర్ మార్వెల్ పాత్రతో పాపులర్ అయిన జాకీ రాబిన్సన్‌ పాత్రతోపాటు అనేక పాత్రల్లో అద్భుతమైన నటనతో మెప్పించగా, నల్ల జాతీయుడైన తొలి సూపర్ హీరోగా చాడ్విక్ హాలీవుడ్‌ ప్రేక్షకుల గుండెల్లో కొలువై ఉన్నాడు.

చాడ్విక్ మృతికి హాలీవుడ్‌లోని ప్రముఖ నటీనటులతో పాటు బాలీవుడ్ పరిశ్రమ కూడా సంతాపం తెలిపింది. రణ్‌వీర్ సింగ్‌, అనుపమ్ ఖేర్, దిశా పఠానీ, అర్జున్ కపూర్, వరుణ్ ధావన్, కరీనా కపూర్, ఈషా గుప్తా, నేహా ధూపియా, యామీ గౌతయ్ ఇలా పలువురు ప్రముఖులు చాడ్విక్‌కి సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.