భారత్‌కు 50 కోట్ల డాలర్ల కొవిడ్‌ సాయం అందించిన అగ్రరాజ్యం

కరోనా మహమ్మారి రెండో ఉద్ధృతితో అల్లాడుతున్న భారత్‌కు సాయం చేస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు భారత్‌కు 50 కోట్ల డాలర్ల కొవిడ్‌ సాయం అందించినట్లు బుధవారం శ్వేతసౌధం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక ముందు కూడా భారత్‌కు సహాయ సహకారాలు కొనసాగిస్తామని తెలియజేసింది. అంతేకాక వివిధ దేశాలకు 8 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపించనున్నట్లు వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి జెన్‌ సాకీ తెలిపారు.

”అధ్యక్షుడు జో బైడెన్‌ సారథ్యంలో దక్షిణాసియా దేశాలకు మా సాయం అందించేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే వివిధ దేశాలకు ఆక్సిజన్‌, మాస్కులు, టెస్టింగ్‌ కిట్లు, మందులు పంపాం. త్వరలో పంపనున్న 8 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల్లో 6 కోట్లు ఆస్ట్రాజెనెకా, మరో 2 కోట్లు ఇతర వ్యాక్సిన్లను పంపుతాం. ఇంటిలిజెన్స్‌ నివేదికల ఆధారంగా భారత్‌తో పాటు, అవసరం ఉన్న ఇతర దేశాలకు తగినన్ని వ్యాక్సిన్లు పంపిణీ చేస్తాం” అని జెన్‌ సాకీ తెలిపారు. కొవిడ్‌తో సతమతమవుతున్న భారత్‌కు సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అమెరికా, యూకే సహా పలు దేశాలు ఇప్పటికే వైద్య సహాయం అందిస్తున్నాయి.