భారత పర్యటనను రద్దు చేసుకున్న బ్రిటన్ ప్రధాని

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దైంది. యూకేలో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో అక్కడ మరోసారి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలంటూ జాన్సన్ ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. మోదీ ఆహ్వానం మేరకు భారత్ వస్తున్నట్టు బోరిస్ జాన్సన్ అధికారికంగా ప్రకటించారు. అయితే, ప్రస్తుతం కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తున్న తరుణంలో భారత్ కు రాలేనని మోదీకి ఆయన స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్టు సమాచారం. దీంతో, రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు రాబోతున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది.