కన్నులపండుగగా జరిగిన అయోధ్య రామాలయ భూమిపూజ

అయోధ్య తో పాటుగా దేశం మొత్తం రామనామస్మరణతో మారుమోగింది. ప్రధాని నరేంద్రమోడి చేతుల మీదుగా అయోధ్య రామాలయ భూమి పూజ ఘనంగా జరిగిoది.  రామ మందిరానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా 5 గోపురాలతో 69 ఎకరాల్లో 3 అంతస్థుల్లో 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మితమవుతోంది. పండితులు సూచించినట్లుగా మధ్యాహ్నం 12.44-  12.45 సమయంలో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీరామచంద్రస్వామి పుట్టిన అభిజిత్ ముహూర్తంనే భూమి పూజ ముహూర్తంగా నిర్ణయిoచగా ఆ సుముహూర్తానికే పండితులు క్రతువును చేయించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సాధువులు హాజరయ్యారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య భూమిపూజ కన్నులపండుగగా జరిగింది.

అనంతరం ప్రధాని మోడి పునాది నుంచి కుంకుమ తీసుకొని నుదుట ధరించారు. అతిథులు గట్టిగా కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ప్రధాని మోడి పునాది వేసిన ప్రాంతానికి శిరస్సు వంచి నమస్కరించారు.

ఈ కార్యక్రమంలో నక్షత్రాకారంలో ఉన్న ఐదు వెండి ఇటుకలను ఉపయోగించారు. ఈ ఐదు వెండి ఇటుకలు 5 విగ్రహాలకు ప్రాతినిధ్యం వహిస్తాయని ఆగమశాస్త్ర పండితుల భావన. భూమిపూజలో హరిద్వార్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలం, పుణ్యనదీ జలాలను వినియోగించారు. మరోవైపు భూమిపూజ జరుగుతున్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు.

భూమి పూజ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడి మాట్లాడుతూ.. ఇదొక చరిత్రాత్మక రోజు అని  వందల ఏళ్ల నిరీక్షణ ఈరోజు ముగిసిందని చెప్పారు. దేశ ప్రజలందరి ఆకాంక్షలతో రామ మందిరం నిర్మాణం జరుపుకుంటోందని తెలిపారు. దశాబ్దాల పాటు రామ్ లల్లా ఆలయం టెంట్ లోనే కొనసాగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రామ మందిర నిర్మాణం కోసం ఎందరో పోరాటం, బలిదానం చేశారని, 130 కోట్ల ప్రజలు వారందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నారని తెలిపారు.

రాముడి కార్యక్రమాలన్నింటినీ హనుమంతుడు చూస్తాడని… హనుమంతుడి ఆశీస్సులతోనే ఈరోజు మందిర నిర్మాణం ప్రారంభమైందని మోడి అన్నారు. కోటాను కోట్ల హిందువులకు ఆలయ నిర్మాణం ఎంతో ముఖ్యమైనదని చెప్పారు. దేశ చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయమని అన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జైశ్రీరామ్ నినాదాలు వినిపిస్తున్నాయని చెప్పారు.

మందిరం నిర్మాణానికి భూమి పూజ చేయడం మహద్భాగ్యం అని అన్నారు. ఈ మహద్భాగ్యాన్ని రామమందిరం ట్రస్టు అవకాశం కల్పించిందన్నారు.