నోబెల్ శాంతి బహుమతి రేసులో ట్రంప్

డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా పదవిలో ఉన్నంత కాలం ఎవరి మీదో ఒకరి మీద విమర్శలు చేయడం.. కించపరచడం వంటివి ఎన్నో వ్యాఖ్యలు చేశారు. ఇక అధ్యక్ష పదవి నుండి దిగిపోయే సమయంలో కూడా ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసి వివాదాలు చెలరేగేలా చేశారు. వాషింగ్టన్ లో ఆందోళనకారులు క్యాపిటల్ హిల్ భవనాన్ని చేరుకోడానికి.. విధ్వంసం సృష్టించడానికి ట్రంప్ కారణమంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ట్రంప్ వ్యాఖ్యలు దుమారం రేపుతాయని ఏకంగా ఆయన సోషల్ మీడియా ఖాతాలనే బ్లాక్ చేసేశారు.

ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సంవత్సరం నోబెల్‌ శాంతి బహుమతి రేస్‌లో డొనాల్డ్ ట్రంప్‌ కూడా ఉన్నారు. అవార్డు కోసం నామినేషన్‌ల ప్రక్రియ ఆదివారంతో ముగియగా, ట్రంప్‌ పేరు కూడా కనిపించింది. ట్రంప్‌తో పాటు స్వీడన్‌కు చెందిన 18 ఏళ్ల పర్యావరణ వేత్త గ్రెటా థన్‌ బర్గ్, రష్యా విపక్ష నాయకుడు అలెక్సీ నావల్సీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌ కూడా పోటీ పడుతున్నాయి. గ్రెటా థన్‌ బర్గ్ కు లేదా కరోనాపై పోరాడుతున్న ప్రపంచ దేశాల మధ్య సమన్వయం కోసం కృషి చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఈ అవార్డు లభించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. డబ్ల్యుహెచ్‌ఓ కన్నా, అంతర్జాతీయ సదస్సుల్లో పర్యావరణ సంరక్షణపై ప్రసంగిస్తూ, ధైర్యంగా ముందడుగు వేస్తున్న గ్రెటాకు అవార్డును ఇవ్వాలని అంటున్నారు.