రాజకీయాల్లో యువత రాణించాలి

  • టీడీపీ – జనసేన పొత్తు రాష్ట్ర భవిష్యత్ కు చారిత్రక అవసరం
  • రాష్ట్రం నుంచి వైసీపీని తరిమికొట్టకపోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు
  • మాజీ మండలి చైర్మన్ యమ్ ఏ షరీఫ్

గుంటూరు: యువత తలుచుకుంటే సాధించలేనిదేమీ ఉండదని, రాష్ట్ర రాజకీయాల్లో సైతం యువత రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మండలి చైర్మన్, టీడీపీ సమన్వయ కమిటీ ఇంచార్జ్ యం ఏ షరీఫ్ అన్నారు. టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొనటానికి గుంటూరుకు విచ్చేసిన షరీఫ్ ను జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళహరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు షరీఫ్ ను దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో ఇలాంటి దుష్ట పరిపాలన ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలనను అంతం చేయాల్సిన చారిత్రక అవసరం ప్రతీఒక్కరిపై ఉందన్నారు. వైసీపీ కబంధ హస్తాల్లోంచి రాష్ట్రాన్ని కాపాడకపోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవని షరీఫ్ అన్నారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ ఉన్నత విలువలతో కూడిన రాజకీయాలకు ప్రత్యక్ష నిదర్శనంగా షరీఫ్ నిలుస్తారని కొనియాడారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా ప్రజా శ్రేయస్సు, న్యాయం కోసమే షరీఫ్ కృషిచేసారన్నారు. షరీఫ్ రాజకీయ ప్రయాణం నేటి యువతకు ఆదర్శనీయమని ఆళ్ళ హరి అన్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు షేక్ గౌస్, నాగూర్, పూసల శ్రీను, మల్లి, జనసేన పార్టీ నాయకులు సయ్యద్ షర్ఫుద్దీన్, మెహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.