పుదుచ్చేరి అసెంబ్లీలో 22న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బలపరీక్ష!

పుదుచ్చేరి: పుదుచ్చేరిలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సంకట స్థితి ఏర్పడింది. సోమవారం కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం ఎదుర్కొననుందని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామి ఖండించినప్పటికీ.. నలుగురు కాంగ్రెస్‌ మంత్రులు రాజీనామా తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మెజార్టీ కోల్పోవడంతో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోక తప్పనిసరి. కిరణ్‌ బేడీని ఎల్‌జిగా తొలగించిన కేంద్రంలోని అధికార బిజెపి.. అనంతరం ఆ పదవిని తమిళసైకి అప్పగించింది.. బాధ్యతలు తీసుకున్న ఆమె.. ప్రభుత్వం మెజార్టీ కలిగి ఉందనడానికి బల ప్రయోగం తప్పనిసరని పేర్కొంటూ..బల ప్రయోగానికి తేదీ ఖరారు చేశారు. 30 స్థానాలు కలిగిన పుదుచ్చేరి అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 15 మంది సభ్యులు ఉన్నారు. ముగ్గురు డిఎంకె ఎమ్మెల్యేలు, ఒక స్వతంత్య్ర ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకున్న కాంగ్రెస్‌, మ్యాజిక్‌ ఫిగర్‌ అయిన 16తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా, తాజాగా కాంగ్రెస్‌ నేతల రాజీనామాతో ప్రతిపక్ష, అధికార పక్ష సంఖ్యా బలం 14గా ఉంది. కాంగ్రెస్‌ ప్రస్తుతం 10 మంది కాంగ్రెస్‌ సభ్యులు ఉన్నారు. దీంతో సంఖ్యా బలం 28కి పడిపోయింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం గట్టెక్కాలంటే మ్యాజిక్‌ ఫిగర్‌ 15ను అందుకోవాల్సిందే.