మిచౌంగ్ తుఫాను బాధితులను ఆదుకోవాలి

  • నష్ట పరిహారం భారీ ఎత్తున పెంచి ఇవ్వాల్సి ఉంది
  • జనసేన పార్టీ అరకు నియోజకవర్గ నాయకుడు బంగారు రామదాసు

అరకు: మిచౌంగ్ తుఫాను కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో భారీ పంటల నష్టం జరిగిందని, తుఫాను బాధితులను ఆదుకోవాలని జనసేన పార్టీ నాయకులు బంగారు రామదాసు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్ మా, వరి, సోడి, వడిసె పంటలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అరకు నియోజకవర్గంలో ఏ గ్రామాన్ని సందర్శించిన తుఫాను వలన అపారమైన నష్టం జరిగిన విషయం మనకు స్పష్టంగా తెలుస్తుందన్నారు. మిచౌంగ్ తుఫానుకు ఇళ్లు, బ్రిడ్జిలు కూలిపోవడం, పశువులు, మేకలు కోళ్లు వంటివి చనిపోవడం జరిగిందన్నారు. అత్యంత ముఖ్యమైనది భీంపోల్ పంచాయతీ లువ్వా కాజ్ వే వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ నష్టపోయిన కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, అలగే ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను ఇళ్లు కోల్పోయిన బాధితులను, ప్రాణనష్టం జరిగిన వారిని ఆదుకోవడంలో ఉదారత చూపించాలని కోరారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో స్పందించకపోవడం వల్ల నష్టం ఏర్పడిందని ఇప్పుడు భారీ వర్షాల వల్ల ఉన్న పంటలను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అతివృష్టి అనావృష్టి కారణంగా రైతులు రెండు విధాలుగా నష్టపోయారని చెప్పారు. అందుకే పంట నష్ట పరిహారం అందజేయడంలో భారీ ఎత్తున పరిహారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎకరాకు లక్ష రూపాయలకు తగ్గకుండా అందించాలని కోరారు. ప్రాణం నష్టం జరిగిన వారి కుటుంబాలకు ఒక్కొక్క వ్యక్తికి రూ.20 లక్షల వరకు పరిహారం అందించాలని కోరారు. ఈ తుఫాను వల్ల అనేక పశువులు, కోళ్లు, గొర్రెలు, మేకలు ఆవులు, గేదెలు మృతి చెందడం జరిగిందని మార్కెట్లో వీటికి ఉన్న ధర ఆధారంగా పరిహారం చెల్లించి పాడి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ క్రాఫింగ్ తో సంబంధం లేకుండా పరిహారం ఇవ్వండి పంట నష్టం జరిగిన రైతులకు ఈ క్రాఫింగ్ ఉంటేనే పరిహారం ఇస్తామనే ప్రకటన సరికాదని వాస్తవంగా ఎవరెవరు పంటలు నష్టపోయారో అధికారులు అంచనా వేసి ప్రతి ఒక్కరికీ పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రాఫింగ్ గురించి గిరిజన రైతులకు ఎంతమందికి అవగాహన ఉందో ఎంతమందికి అవగాహన కల్పించారో ప్రభుత్వమే చెప్పాలన్నారు. అవగాహన లేని రైతులే 100కి 90 శాతం మంది ఉంటారని అందువల్ల ఈ క్రాఫింగ్ తో సంబంధం లేకుండా నష్టం జరిగిందని అధికారులు గుర్తించి వారికి పరిహారం అందించే ప్రక్రియలో జాప్యం జరగడానికి వీలు లేదని జనసేన పార్టీ నాయకులు బంగురు రామదాసు చెప్పారు. ఈ కార్యక్రమలో పాల్గొన్న వారు జనసేన నాయకులూ సిదేరి దనేశ్వరావూ, రాము జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.