భారత్ స్ట్రెయిన్‌లు మరింత ప్రమాదకరం: ఎయిమ్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

Indian Covid Strains అత్యంత ప్రమాదకరమని, దీని వల్ల దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాకపోవచ్చని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హెచ్చరించింది.

 దేశంలో కరోనా వైరస్ మహమ్మారి రెండో దశ వ్యాప్తి

భారత్‌లో వేరియంట్స్‌తో పొంచి ఉన్న ముప్పు

అప్రమత్తంగా ఉండాలన్న ఎయిమ్స్ డైరెక్టర్

దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ  అసాధ్యమని ఎందుకంటే మొత్తం జనాభాలో కనీసం 80 శాతం మందిలో కోవిడ్ యాండీబాడీలు ఉండాలని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో గుర్తించిన కొత్త వేరియంట్‌లను పరిగణనలోకి తీసుకుంటే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందడమే కాదు, ప్రమాదకరమైంది అని పేర్కొన్నారు. అంతేకాదు, ఇప్పటికే కోవిడ్ యాంటీబాడీలున్న వారు సైతం ఈ వేరియంట్‌ వల్ల మరోసారి వైరస్ బారినపడే అవకాశం ఉందని అన్నారు.

గడచిన రోజులుగా కొత్త కేసులు పెరగడానికి దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 240 కొత్త స్ట్రెయిన్‌లు కారణమని మహారాష్ట్ర కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి పేర్కొన్నారు. మహారాష్ట్రతో పాటు కేరళ, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, పంజాబ్‌లోనూ పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వ వ్యాక్సినేషన్ ప్రణాళిక రోగనిరోధక శక్తిని కలిగించడం ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ సృష్టించడం మీద ఆధారపడి ఉంటుంది.

తొలి దశలో మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తర్వాత దశలో 50 ఏళ్లు పైబడినవారు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న 27 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని యోచిస్తోంది.