మయన్మార్‌ సైన్యం ఫేస్‌బుక్‌ ఖాతా తొలగింపు

మయన్మార్‌లో తిరుగుబాటు చేసి అధికారాన్ని చేపట్టిన సైన్యానికి చెందిన అధికారిక ఫేస్‌బుక్‌ పేజీని సామాజిక మాధ్యమ దిగ్గజ సంస్థ తొలగించింది. పలు పోస్టుల ద్వారా ఈ పేజీలో దేశంలో హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించింది. సైన్యం చేతిలో పదవీచ్యుతురాలైన ఆంగ్‌సాన్‌ సూకీకి మద్దతుగా దేశవ్యాప్తంగా శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనలకు వ్యతిరేకంగా సైన్యం హింసను పెంచుతోందని ఫేస్‌బుక్‌ పేర్కొంది. హింసాత్మక విధానాలతో తమ సంస్థ నిబంధనలను మిలిటరీ పదేపదే ఉల్లంఘిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ సంస్థ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ”అంతర్జాతీయ విధానాలకు మేం కట్టుబడి ఉన్నాం. హింసను ప్రేరేపిస్తూ మా కమ్యూనిటీ ప్రమాణాలను పదేపదే ఉల్లంఘిస్తున్నందున.. ‘టాట్మడా ట్రూ న్యూస్‌ ఇన్‌ఫర్మేషన్‌ టీం’ అనే పేరుతో ఉన్న మిలిటరీ పేజీని ఫేస్‌బుక్‌ నుంచి తొలగిస్తున్నాం” అని ఆ సంస్థ ప్రతినిధి ప్రకటనలో తెలిపారు. దీనిపై మిలిటరీ ప్రతినిధిలు స్పందించాల్సి ఉంది. మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలు శనివారం హింసాత్మకంగా మారాయి. సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మరణించగా.. మరో 40 మంది గాయాలైన సంగతి విదితమే.