ఆన్‌లైన్ క్లాసులు, ఫైనల్ఎగ్జామ్స్‌ పై కేంద్రం అభిప్రాయo

ఫైనల్ ఇయర్ పరీక్షలను అన్ని కాలేజీల్లో రద్దు చేయాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తోండగా…కాలేజీల్లో ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహించాలా లేదా అని దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొంది.  ఇదిలా ఉండగా  మానవ వనరుల అభివృద్ధిశాఖకు చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణతో పాటు పాఠశాలల ప్రారంభం, ఆన్‌లైన్ తరగతులపై కూడా చర్చించారు. కళాశాలల్లో 2020 సంవత్సరాన్ని జీరో ఇయర్‌గా ప్రకటించకూడదని సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే సెప్టెంబర్‌లో పరీక్షలు జరుగుతాయా లేదా అనే దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోనప్పటికీ, ఈ ఏడాది చివరినాటికి పరీక్షలు నిర్వహించడం గురించి చర్చ జరిగింది. ఈ చర్చ లో భాగంగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు కళాశాలల్లో చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించడానికి నిరాకరించాయి. ఈ సమావేశంలో పాఠశాలల ప్రారంభానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. పాఠశాలల్లో 3 వ తరగతి వరకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించకూడదని సూచించారు. మిగిలిన తరగతులకు పూర్తి షెడ్యూల్‌తో ఆన్‌లైన్ తరగతులను నిర్వహించాల్సి ఉంటుందని భావిస్తున్నారు.