సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేయండి: సీఎం కేజ్రీవాల్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇవాళ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలో సుమారు ఆరు లక్షల మంది చిన్నారులు సీబీఎస్ఈ పరీక్షలు రాస్తున్నారని, అయితే ఆ పరీక్షల కోసం సుమారు లక్ష మంది టీచర్లు విధులు నిర్వహించాల్సి ఉంటుందని, పరీక్షలు వేళ అవే హాట్‌స్పాట్ సెంటర్లుగా మారుతాయని, దీంతో కరోనా వ్యాప్తి జరుగుతుందని, చిన్నారి విద్యార్థుల జీవితాలు, ఆరోగ్యం ముఖ్యమని, అందుకు సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలని కోరుతున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. పరీక్షల కోసం ఇతర ప్రత్యామ్నాయ విధానాలను ఆలోచించాలన్నారు. ఆన్‌లైన్ విధానం లేదా ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా పిల్లలను ప్రమోట్ చేయాలని సీఎం కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.

కరోనా కేసులు చాలా శరవేగంగా పెరుగుతున్నాయన్నారు. గత 24 గంటల్లో ఢిల్లీలో సుమారు 13,500 కేసులు నమోదు అయ్యాయన్నారు. గత ఏడాది నవంబర్‌లో గరిష్ట స్థాయిలో వైరస్ ప్రబలినప్పుడు కేవలం 8500 కేసులు మాత్రమే నమోదు అయ్యాయని, కానీ ఇప్పుడు 13,500 కేసులు నమోదు కావడం అంటే పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లే అని ఆయన అన్నారు. సెకండ్ వేవ్ చాలా డేంజరస్‌గా ఉందని సీఎం కేజ్రీ తెలిపారు. గడిచిన 15 రోజుల డేటాను పరిశీలిస్తే, దాంట్లో రోగులు ఎక్కువ శాతం 45 ఏళ్ల లోపువారే ఉన్నారన్నారు. అందుకే యువత బయట తిరగవద్దు అని కోరారు.