భవానీపూర్‌లో మమతా ఘన విజయం..

భవానీపూర్‌లో సీఎం మమతాబెనర్జీ ఘన విజయం సాధించారు. 58,832 ఓట్లతో బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌ మీద గెలుపొంది రికార్డ్‌ సృష్టించారు. ఐతే అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భవానీపూర్‌లో సీఎం మమత హవా కొనసాగింది. తొలి రౌండ్‌ నుంచే ఆధిక్యం ప్రదర్శిస్తున్న మమత.. చివరి రౌండ్‌ ముగిసేసరికి ఆధిక్యంలో ఉన్నారు. మమతా బెనర్జీ 58 వేల 832 ఓట్ల తేడాతో బిజెపి అభ్యర్ధి ప్రియాంక టిబ్రేవాల్‌ని ఓడించారు. దీంతో మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి హ్యాట్రిక్ సాధించారు.

ఎక్కడా ప్రియాంకా టిబ్రేవాల్‌ సీఎం మమతకు పోటీ ఇవ్వలేకపోయారు. ఈ ఉప ఎన్నికలో గెలుపుతో భవానీపూర్‌లో సీఎం మమతా బెనర్జీకి తిరుగులేదని మరోసారి రుజువైంది. తొలి రౌండ్‌ నుంచి ఆధిక్యంలోనే కొనసాగారు మమత. ఇక భవానీపూర్‌తో పాటు జంగీపూర్‌, సంషేర్‌ గంజ్‌ స్థానాల్లోనూ తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉప ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ దూకుడుతో..ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కోల్‌కతాలోని మమత ఇంటి వద్దకు భారీగా చేరుకున్న పార్టీ కార్యకర్తలు..డాన్సులు చేస్తూ హంగామా చేస్తున్నారు. మమత నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్‌లో నందిగ్రామ్‌ నుంచి ఓడిపోయారు మమత. బీజేపీ తొండి ఆడిందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అయినా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారామె. సీఎంగా కొనసాగాలంటే ఎమ్మెల్యేగా గెలవక తప్పని పరిస్థితుల్లో భవానీపూర్ ఉప ఎన్నికల బరిలో నిలిచారు మమత. అనుకున్నట్టుగానే భారీ మెజార్టీతో విజయం సాధించారు.

మమతా బెనర్జీ తన సొంత స్థానమైన భవానీపూర్ నుండి గత రెండు ఎన్నికల్లో గెలుపొందారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నందిగ్రామ్ నుండి పోటీ చేశారు. ఆమె శుభేందు అధికారి చేతిలో ఓడిపోయారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయం పొందింది. TMC 213 సీట్లు గెలుచుకుంది. మమతా బెనర్జీ మూడోసారి CM అయ్యారు.

కౌంటింగ్ ప్రారంభం నుంచి మమత ఆధిక్యాన్ని కొనసాగించారు.. వేడుక ప్రారంభమైంది

భవానీపురిలో విజయంతో ఈ రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ TMC ఆధిక్యంలో కొనసాగుతోంది. మమతా బెనర్జీ విజయం తరువాత కలిఘాట్‌లోని మమతా బెనర్జీ కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేడుకలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని విజయోత్సవాలు చేపట్టవద్దని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి చర్యలు తీసుకుంది. అయితే దీని తరువాత మమతా బెనర్జీ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి విజయోత్సవ యాత్ర చేయవద్దని ఆదేశించారు.