యూపీలో హై అలర్ట్.. రైతులపై కారు ఎక్కించిన కేంద్ర మంత్రి కొడుకు.. 8 మంది మృతి..

ఉత్తరప్రదేశ్‌లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి కొడుకు కారెక్కించారు. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. బీజేపీ కార్యకర్తలు సహా పలువురికి గాయాలయ్యాయి. యూపీలోని లఖీంపూర్ఖేరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఆగ్రహించిన రైతులు.. కేంద్రమంత్రి కొడుకు కాన్వాయ్‌పై దాడికి దిగారు. మూడు వాహనాలకు నిప్పు పెట్టి తగులబెట్టారు. ప్రస్తుతం లఖీంపూర్‌ఖేరిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అలర్ట్ అయిన అధికారులు.. ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన అధికారులు.. లఖీంపూర్‌ఖేరిలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

కాగా, అమరులైన రైతుల్లో ఒకరిని కేంద్ర మంత్రి కొడుకు కాల్చి చంపేశాడని సంయుక్త కిసాన్ మోరా ఆరోపించింది. కేంద్ర మంత్రి కాన్వాయ్ రైతులపై దూసుకు వెళ్లిన ఘటనపై రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ వ్యాప్తంగా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ముందే అలర్ట్ అయిన అధికారులు.. శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు చేపడుతున్నారు.