ప్రజల కష్టాన్ని సాక్షికి దారబోస్తున్న జగన్ రెడ్డి.. జీవో నెం 12 పై జనసేన నిరసన

  • జీవో నెంబర్ 12 పై ధ్వజమెత్తిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్
  • జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు

గుంటూరు: ప్రజా ధనానికి ధర్మకర్తలా వ్యవహరించాల్సిన పాలకులే ప్రజాధనాన్ని భక్షిస్తున్నారని, పథకాల ప్రకటనల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ముఖ్యమంత్రి మానసపుత్రిక సాక్షి పత్రికకు ధారబోస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు లక్షలకు పైగా ఉన్న వాలేంటీర్లకు పథకాల పట్ల అవగాహన కల్పించేందుకు సాక్షి పత్రిక మాత్రమే కొనుగోలు చేసేలా ప్రతీ నెలా రెండు వందలు విడుదల చేస్తూ ఇచ్చిన జీఓ నెంబర్ 12 ని రద్దు చేయాలి అంటూ జనసేన పార్టీ గురువారం లాడ్జీ సెంటర్లో పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టింది. జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పెద్దఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

  • రహదారుల నిండా గోతులు – సాక్షికేమో నిధులు
  • రాజుల సొమ్ము రాళ్లపాలు – ఆంధ్రుల సొమ్ము సాక్షి పాలు
  • పథకాలు గోరంత – ప్రచారం కొండంత – సాక్షికే డబ్బంతా

అంటూ ప్ల కార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా బోనబోయిన మాట్లాడుతూ ప్రజలు పన్నుల రూపేణా కట్టే డబ్బులను ప్రజా సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి వినియోగించాలి కానీ ముఖ్యమంత్రి మాత్రం తన సొంత మీడియా సంస్థలకు ఆ ధనాన్ని మల్లించటం ప్రజాద్రోహమని దుయ్యబట్టారు. మూడేళ్ళుగా వాలంటీర్లు ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన లేకుండానే విధులు నిర్వహిస్తున్నారా అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు వాలంటీర్లను అడ్డం పెట్టుకొని రాజకీయ రాక్షస క్రీడకు పాల్పడ్డారని ఇప్పుడు అదే వాలంటీర్లను పావులుగా ఉపయోగించుకొని ప్రజాధనాన్ని సొంత మీడియాకు దోచిపెడుడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సంపదను ఎలా దోచుకోవాలో, ఎన్ని రకాలుగా దోచుకోవాలో అనే విషయంలో ముఖ్యమంత్రి నుంచి కిందిస్థాయి వైసీపీ నేతల వరకు పీ హెచ్ డీ చేసారని బోనబోయిన శ్రీనివాస్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రకటనల రూపంలో ఒక్క సాక్షి పేపర్ కే సుమారు 380 కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టిందని.. జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టి రూపంలో, మద్యం రూపంలో, ఇసుకలో దోచుకుంటున్న వేల కోట్లు దిగమింగుతున్నా కూడా వైసీపీ నేతలకు ఆకలి తీరటం లేదన్నారు. ఎన్ని లక్షల కోట్లు దోచుకుంటే వైసీపీ నేతలు ధనదాహం తీరుతుందో అర్ధం కావటం లేదన్నారు. ఒక పథకాన్ని నాలుగైదు విడతలుగా ఇవ్వటం, అలా ఇచ్చిన ప్రతీసారి సాక్షికి ప్రకటనల పేరుతో కోట్లు తగలేయటం పరిపాటిగా మారిందన్నారు. కరోనా లాంటి విపత్కర సమయంలో ప్రపంచం మొత్తం నష్టపోయినా ఒక్క సాక్షి సంస్థ మాత్రం కోట్లు వెనకేసుకుందని, 2021 సంవత్సరంలో అక్షరాలా వంద కోట్లు సాక్షిలో ధారబోశారని విమర్శించారు. అసలు ప్రభుత్వానికి సంభందించిన సమాచారాన్ని, పథకాల అమలును సమాచారశాఖ ఇచ్చిన మేరకు అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురిస్తాయని కానీ ఆ వంకతో సాక్షి పత్రికకు కోట్లు కట్టబెట్టడం అత్యంత బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. సాక్షి పత్రికలో రాసే అబద్ధపు రాతల్ని, జరగని, చేయని అభివృద్ధిని వాలంటీర్లు గ్లోబల్ ప్రచారంతో ప్రజలను మాయ చేసేలా జరిగే కుట్రలను జనసేన ఎట్టిపరిస్థితుల్లోనూ సహించదని అన్నారు. ఇప్పటికైనా ప్రజాధనం దుర్వినియోగం అయ్యేలా విడుదల చేసిన జీవో నెంబర్ 12 ను వెంటనే నిలిపివేయాలని లేనిపక్షంలో జనసేన పెద్దఎత్తున ప్రజల భాగస్వామ్యంతో పోరాటం చేస్తుందని గాదె వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లక్ష్మీ దుర్గ, జిల్లా అధికార ప్రతినిధులు ఆళ్ళ హరి, తవిటి భవన్నారాయణ, ఉపాదక్ష్యులు అడపా మాణిక్యాలరావు, ఇస్మాయిల్ భేగ్, బిట్రగుంట మల్లిక, ప్రధాన కార్యదర్సులు నారదాసు ప్రసాద్, ఉప్పు రత్తయ్య, తాళ్లూరి అప్పారావు, సుబ్బారావు, మండల అధ్యక్షులు గంధం సురేష్ , చందు శ్రీరాములు, వీరేళ్ల వెంకటేశ్వరరావు, నరసయ్య, నగర కార్యదర్సులు చింతా రాజు, వీరేళ్ల సుబ్బారావు, కటకంశెట్టి విజయలక్ష్మి, యడ్ల రాధిక, ఉపేంద్ర, ఉదయ్, తన్నీరు గంగరాజు అరుణ, పద్మావతి, వరలక్ష్మి, అనసూయ, కొర్రపాటి నాగేశ్వరరావు, కిట్టూ, పులిగడ్డ గోపి తదితరులు పాల్గొన్నారు.