రత్నగిరి కాలనీ ప్రజలకు అండగా గాదె

గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 40 వ డివిజన్ లో దాదాపు 8 నెలల క్రితం ఇక్కడ నివసించే నిరుపేదల ఇళ్లను మునిసిపల్ అధికారులు రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చి వేయడం జరిగింది. అక్కడి రోడ్లు, డ్రైనేజ్ లు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. గత 10 రోజుల నుంచి త్రాగు నీరు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిపై నిరసనకు దిగిన స్థానిక ప్రజలకు మద్దతుగా జనసేన పార్టీ తరవున గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆ ప్రాంతానికి చేరుకొని వారికి అండగా నిలిచారు. జిల్లా అధ్యక్షులు గాదె మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా వేదికను పగలగొట్టించిన సంఘటన అందరికి తెలిసిన విషయమే. అదే తరహాలో ఆయన ప్రభుత్వంలో పని చేస్తున్న ఈ అధికారులు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. కూల్చివేతల మీద వీరికి ఉన్న శ్రద్ధ పునః నిర్మించే దాని మీద లేదు అని విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది. పల్నాడు ప్రాంతం నుండి గుంటూరు టౌన్ లోకి వచ్చేందుకు ప్రధాన రహదారి ఇది. అలాంటి రహదారి పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది. ఈ రోడ్డు మీద లేస్తున్న దుమ్ము ప్రయాణికులకు మరియు స్థానికులకు ఎంతో ఇబ్బంది కలుగజేస్తుంది. దానితో పాటుగా ఆ రోడ్డు మీద ఉన్న గుంతలు మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గత పది రోజులుగా ఆ ప్రాంతంలో నీటి సరఫరా కూడా ఆగిపోవడంతో స్థానికంగా ఉన్న మహిళలు ఆందోళనకు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఈ మునిసిపల్ అధికారుల పని తీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. స్థానికంగా ఉన్న కార్పొరేటర్ దృష్టికి ఈ సమస్యలను స్థానికులు తీసుకువెళ్లినప్పుడు సామాజికవర్గాల పేరు మీద బేధభావాలు చూపించిన విషయాన్ని ఇక్కడి వారు మా దృష్టికి తీసుకువచ్చారు. ఒక ప్రజా ప్రతినిధి అయ్యుండి కులాల పేరు మీద ప్రజలను కించపరచడం అనేది నీచాది నీచమైన విషయం. ఆ కార్పొరేటర్ గనక బాధితుల పక్షాన నిలవకపోతే అతనిని రోడ్డు మీదకు లాక్కోస్తాం, ప్రజల ముందు నుంచోబెడతాం. అలాగే అధికారులు అన్న మాట ప్రకారం మంగళవారం సాయంత్రంలోపు ఈ ప్రాంతానికి నీటి సరఫరా వదలకపోతే బుధవారం మునిసిపాలిటీ ముందు జనసేన పార్టీ తరపున స్థానిక ప్రజలతో కలిసి ధర్నా చేస్తాం. అలాగే ఈ రత్నగిరి కాలనీ సమస్యలను గనక అధికార యంత్రంగాని, ప్రజాప్రతినిధులు గాని తీర్చకపోతే మునిసిపల్ కార్పొరేషన్ కి తాళాలు వేసే పరిస్థితి కార్యక్రమం కూడా చేపడతాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నారదాసు రామచంద్ర ప్రసాద్, శిఖా బాలు, సుంకే శ్రీను, శివకుమార్, రాజాక్, హుస్సేన్, తుమ్మల నరసింహారావు, అనిల్, సాయి మరియు జనసైనికులు పాల్గొన్నారు.