ఏలూరు మార్కెట్ యార్డులో మేడే పోస్టర్ ఆవిష్కరించిన రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు, అంతర్జాతీయ శ్రామిక దీక్షా దినోత్సవం మేడే 137 సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు. రాష్ట్ర కమిటీ ముద్రించిన వాల్ పోస్టర్లను బుధవారం ఏలూరు మార్కెట్ యార్డు హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. మేడే ను జయప్రదం చేయాలనీ, కార్మిక హక్కులను కాపాడేందుకు పోరాడాలని, నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలనీ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హమాలీ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఇంచార్జ్ రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ కార్మికవర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న హక్కులు, సౌకర్యాలు, రాయితీలను మోడీ-షాల ప్రభుత్వం రద్దుచేయడం దుర్మార్గమని ఆరోపించారు. 44 చట్టాలను నాలుగు కోడ్ లు గా మార్చి, కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలు చేశారని విమర్శించారు. ఇప్పుడున్న కార్మిక చట్టాలు అమలు చేయాలనీ, హమాలీ, అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికవర్గం మేడే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా సోమవారం సాయంత్రం ఏలూరు దక్షిణపువీధి జ్వలా పరమేశ్వర కాలనీలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యు. రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, ఇఫ్టూ నగర ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు, యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు సిహెచ్.నూకరాజు, పల్లి గంగరాజు, కోరాడ అప్పారావు, ధన్నాన విజయ్, చల్లా శ్రీను, బండి నాగేశ్వరరావు, చిట్టి శివ, గుంజే వెంకటేశ్వరరావు, కొండ, లక్ష్మణ, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.