దేశం గర్వించదగ్గ రోజు: డాక్టర్ పసుపులేటి

  • చంద్రయాన్ 3 విజయంతో తిరుగులేని శక్తిగా ఎదిగిన భారత్
  • ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

చిత్తూరు: చంద్రయాన్ 3 విజయం అంతరిక్ష పరిశోధనల్లో భారత్ సత్తాను మరో మారు నిరూపించిందని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పేర్కొన్నారు. ల్యాండర్ విక్రం.. ప్రజ్ఞాన్ రోవర్ ను జాబిల్లిపై వదిలిన రోజు భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు అని ఆయన బుధవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. చంద్రయాన్ 3లో పాలు పంచుకున్న శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. జాబిల్లి దక్షిణ ధృవంపై కాలు మోపిన తొలిదేశంగా భారత్ నిలిచిందన్నారు. యావత్ దేశం మొత్తం ఈ అపురూప ఘట్టం కోసం వేయి కళ్లతో ఎదురుచూసిందన్నారు. తిరుమల శ్రీవారి ఆశీసులు తీసుకొని ప్రయోగించిన చంద్రయాన్ 3 విజయవంతం కావడం యావత్ భారతాన్ని ఆనంద డోలికల్లో ముంచెత్తిందన్నారు. భారత్ మరిన్ని అంతరిక్ష ప్రయోగాల్లో విజయం సాధించాలని ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.