కరోనా మూడో వేవ్‌ కూడా వచ్చే అవకాశం ఉంది: ఎయిమ్స్ చీఫ్‌

కరోనా రెండో దశ ఉద్ధృతి కొనసాగుతున్న తరుణంలో ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా మరో కీలక విషయం వెల్లడించారు. భారత్‌లో మూడో వేవ్‌ వచ్చే అవకాశం కూడా ఉందని తెలిపారు. వైరస్ ఇలాగే వృద్ధి చెంది రోగనిరోధక వ్యవస్థను సైతం తప్పించుకునే సామర్థ్యాన్ని సంతరించుకుంటే మూడో వేవ్‌ తప్పదన్నారు.

అయితే, అప్పటికల్లా చాలా మందికి వ్యాక్సిన్లు అందే అవకాశం ఉందని.. మూడో  వేవ్‌ ప్రస్తుతం ఉన్నంత తీవ్రంగా ఏమీ ఉండకపోవచ్చునని అంచనా వేశారు. తొలి వేవ్‌తో పోలిస్తే ప్రస్తుతం వైరస్‌ చాలా వేగంగా వ్యాపిస్తోందని తెలిపారు. వైరస్‌లో మార్పులు చోటుచేసుకుంటుండడం కూడా వేగవంతమైన వ్యాప్తికి ఒక కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

ఒకవేళ లాక్‌డౌన్‌ విధించాల్సి వస్తే కనీసం రెండు వారాల పాటు విధించాలని గులేరియా అభిప్రాయపడ్డారు. అదీ చాలా కఠినంగా అమలు చేయాలన్నారు. వారాంతపు లాక్‌డౌన్లు, రాత్రిపూట కర్ఫ్యూల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చునన్నారు.