అగ్ని-5 విజయవంతం

అగ్ని-5 బాలిస్టిక్‌ క్షిపణిని బుధవారం భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే ఈ క్షిపణి ఐదు వేల కిలోమీటర్ల వరకూ లక్ష్యాలను చేధించగలదు. ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి (ఐసిబిఎం) కేటగిరీకి చెందిన అగ్ని-5 క్షిపణిని ఒడిశా తీరంలోని ఎపిజె అబ్దుల్‌ కలామ్‌ ద్వీపం నుంచి రాత్రి 7.50 గంటలకు ప్రయోగించారు. మూడు దశల ఘన ఇంధన ఇంజిన్‌ను ఉపయోగించే అగ్ని-5 చాలా కచ్చితత్వంతో లక్ష్యాలను చేధిస్తుంది. ‘మొదటగా ఉపయోగించం’, ‘విశ్వసనీయమైన కనీస నిరోధం’ కలిగి ఉండాలనే భారత దేశ విధానాలకు అనుగుణంగా ఈ అగ్ని-5 క్షిపణి పరీక్షను నిర్వహించారు. జలాంతర్గామి ఆధారిత అణు క్షిపణులతో పాటు, భారతదేశ అణు నిరోధక వ్యవస్థకు పునాదిగా ఈ అగ్ని-5 క్షిపణి పరీక్షను నిర్వహించారు.