నేతాజీ జయంతి వేడుకల్లో అమిత్‌షా

అసోంలో నిర్వహించిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ జయంతి వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ 125వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర ‘పరాక్రమ్‌ దివస్‌’ నిర్వహిస్తున్నారన్నారు. బోస్‌ ధైర్యసాహసాలు భారత స్వాతంత్ర్య పోరాటానికి కొత్త శక్తిని ఇచ్చాయన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో తన ఆకర్షణీయమైన నాయకత్వంతో దేశంలోని యువతను సంఘటితం చేశారని కొనియాడారు. అమిత్‌ షా అసోం, మేఘాలయాల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. గువాహటిలోని పారా మిలటరీ దళాల కోసం ‘ఆయుష్మాన్ సీఏపీఎఫ్‌’ పథకాన్ని హోంమంత్రి ప్రారంభించనున్నారు. అలాగే ఆదివారం షిల్లాంగ్‌లో జరిగే నార్త్‌ ఈస్టర్న్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఈసీ) ప్లీనరీ సెషన్స్‌కు చేరుకోనున్నారు. అనంతరం మళ్లీ అసోంకు చేరుకొని బోడోల్యాండ్‌ టెరిటోరియల్‌ రీజియన్‌ ఒప్పందంపై సంతకం చేసిన రోజు సందర్భంగా నిర్వహించే మొదటి వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారు.