బీరుట్‌ సీపోర్ట్ లో మరో భారీ అగ్ని ప్రమాదం

లెబనాన్‌ బీరుట్‌ సీపోర్ట్ లో గురువారం మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆగస్ట్‌ 4న జరిగిన పేలుడులో దాదాపు మూడువేల టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ పేలగా.. దాని ధాటికి కిలోమీటర్ల కొద్ది ప్రభావం కనిపించింది. ఈ భారీ పేలుడులో సుమారు 190 మంది మృతి చెందగా, వేలాది సంఖ్యలో జనం గాయపడ్డారు. ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లింది. ఆ ఘటనను మరచిపోక ముందే తాజాగా గురువారం మధ్యాహ్నం ఓడరేవు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఓడరేవు వద్ద డ్యూటీ ఫ్రీ జోన్‌లో చమురు, టైర్లను ఉంచే గిడ్డంగి వద్ద మంటలు చెలరేగినట్లు లెబనీస్‌ సైన్యం పేర్కొంది. మంటలను అదుపులోకి తెస్తున్నట్లు, ఆపరేషన్‌లో ఆర్మీ హెలికాప్టర్లు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ ఘటనతో మరోసారి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ఓడరేవు దగ్గర ఉన్న కార్యాలయాలు ఉన్న సంస్థలు తమ ఉద్యోగులను అక్కడి నుండి వెళ్లిపోయాలని కోరినట్లు స్థానిక టీవీ చానళ్లు తెలిపాయి. ఇతర ప్రాంతాలను నుంచి ఓడరేవు సమీపానికి వెళ్లే ప్రధాన రహదారిని లెబనీస్‌ దళాలు మూసివేశాయి. టైర్లను నిల్వ ఉంచే గోడౌన్‌ వద్ద మంటలు చెలరేగాయని లెబనాన్‌ జాతీయ వార్తా సంస్థ పేర్కొంది. పోలీస్‌ ప్రతినిధి కల్నల్‌ జోసెఫ్‌ మసలాం మాట్లాడుతూ ఓడరేవులో ఏం జరుగుతుందో తమకు సమాచారం లేదని, ఆ ప్రాంతం సైన్యం నియంత్రణలో ఉందని పేర్కొన్నారు. కాగా, అగ్ని ప్రమాదం ఓడరేవులో ఈ వారంలో రెండోది. మంగళవారం స్వల్పస్థాయిలో మంటలు చేలరేగాయి.