మరో వారం రోజులు కర్ఫ్యూ: కేజ్రీవాల్ సర్కార్

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కొత్త నిర్ణయం తీసుకున్నది. వారాంతపు కర్ఫ్యూను.. మరో వారం రోజుల పాటు పాడిగించారు. శుక్రవారం మొదలైన కర్ఫ్యూ ఆంక్షలను.. వచ్చే సోమవారం వరకు అమలులో ఉండనున్నట్లు ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవాళ రాత్రి నుంచి కర్ఫ్యూ అమలులోకి వస్తుంది. ఆదివారం రోజున ఢిల్లీలో అత్యధిక స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సుమారు 25,462 కొత్త కేసులు నమోదు కావడంతో అక్కడ ఆందోళన నెలకొన్నది. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 30 శాతంగా ఉన్నది. అంటే ప్రతి మూడు శ్యాంపిళ్లలో ఒకరు పాజిటివ్‌గా తేలుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ఫ్యూ ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. ఢిల్లీ హాస్పిటళ్లలో 100 కన్నా తక్కువ సంఖ్యలో ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉన్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు.