‘అమ్మ ఒడి’ తప్పించుకోవటానికే బడులు మూతపెడుతున్నారా ముద్దుల మామయ్య..!

* ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని ఊడ్చేస్తున్నారా ..?
* జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 వేలకుపైగా స్కూళ్లకు తాళాలు వేసి, భావి భారత పౌరులకు విద్యను దూరం చేస్తున్న ముద్దుల మామయ్య.. అమ్మ ఒడి నుంచి తప్పించుకోవటానికా? అసలు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా చెయ్యడానికా? అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు వైసీపీ నాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 711 స్కూళ్ళను మూసేసిన వైసీపీ ప్రభుత్వం అక్కడున్న చిన్నారుల భవిష్యత్తు ఏం చెయ్యాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. తమ బడి కోసం పిల్లలు పోరాటం చేస్తున్న తీరు, పిల్లలను రోడ్లపై కూర్చోపెట్టిన ఘన చరిత్ర వై.సీ.పీ. ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. బహిరంగ వేదికలపై ‘మాట తప్పం..’ అనే ఊత పదాలతో జనాన్ని మభ్య పెడుతున్న వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా మాట తప్పుతున్నారని ఎద్దేవా చేశారు. సంఖ్యాపరంగా అంచనా వేసి ఉన్న బడులను మూసేసి, దూర ప్రాంతాలలో విలీనం చేసి, విద్యార్థులను రెండుమూడు కిలోమీటర్ల మేర నడిచి వెళ్లమని చెప్పటం ఎంత వరకు సమంజసం అన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా చర్యలు చేపట్టి, సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్షరాస్యత శాతం దిగువ స్థాయికి పడిపోవడానికి ప్రభుత్వ విధానాలే కారణమని పేర్కొన్నారు. ప్రతీ మారుమూల ప్రాంతాల చిన్నారులకు విద్యను అందించే ప్రణాళిక జనసేన వద్ద ఉందని, అధికారంలోకి వచ్చాక విద్యారంగంలో విప్లవాత్మకమైన అభివృద్ధి చేసి చూపుతామని స్పష్టం చేశారు.