దీపకాంతులతో అయోధ్య ప్రపంచ రికార్డు

దీపోత్సవ వేళ అయోధ్య సరికొత్త శోభ సంతరించుకుంది. సరయూనదీ తీరాన 12 లక్షల దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించింది. అయోధ్యనగరం అంతటా దీపకాంతులు, లేజర్ షోలతో మిరుమిట్లుగొలిపింది.2021 దీపోత్సవం.సందర్భంగా అయోధ్య నగరం సరికొత్త శోభను సంతరిచుకుంది. దీపోత్సవ వేడుకలో భాగంగా అయోధ్యలోని సరయూ నది ఒడ్డున మట్టి దీపాలు వెలిగించారు. లక్షలాది దీపపు ప్రమిదల వెలుగుల మధ్య ధగధగలాడింది సరయూ నదీ తీరం.

అయోధ్యలో దీపోత్సవ 2021 కార్యక్రమం గిన్నీస్ రికార్డులలోకి ఎక్కింది. గతేడాది దీపావళి సమయంలోనూ 5 లక్షల 84 వేల 572 దీపాలను వెలిగించి గిన్నిస్ రికార్డు నెలకొల్పింది యూపీ ప్రభుత్వం. ఇప్పుడు ఆ రికార్డును తిరగరాసింది. ఈసారి అయోధ్యలో మొత్తంగా 12 లక్షల దీపాలను వెలిగించారు. ఈ 12 లక్షల దీపాలలో 9 లక్షలు సరయు నది తీరాన ఉన్న రామ్ కీ పైడీ ఘాట్‌లో వెలిగించారు. మిగిలిన 3 లక్షలు, అయోధ్యలోని వివిధ మఠాల్లో దీప ప్రజ్వలన చేశారు. అయోధ్యలో అతిపెద్ద నూనె దీపాల ప్రదర్శన నిర్వహించినందుకుగాను ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ మరియు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ కెక్కాయి.

దీపోత్సవ వేడుకలో భాగంగా అయోధ్యలో ఏర్పాటు చేసిన రంగురంగుల లైట్లు మరియు లేజర్ షో అందరినీ ఆకట్టుకుంది. ప్రధానంగా ఆలయ ప్రాంగణాలు లేజర్ షోలతో మిరుమిట్లు గొలిపాయి. అయోధ్యతోపాటు యావత్ ప్రపంచానికి మంచి జరగాలని కోరుకుంటూ ఈ ప్రయత్నం చేస్తున్నట్లు యూపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొన్ని రోజులుగా సరయు నదీతీరంలో అయోధ్య చరిత్రను తెలిపే లేజర్ షోలునిర్వహిస్తున్నారు. దీపోత్సవ వేడుకలో భాగంగా కళాకారులు అయోధ్యలో రామలీలాను ప్రదర్శించారు. రామ్‌లీలాను ఆద్యంతం తిలకించారు భక్తజనం. ఆద్యంతం జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్య నగరం మార్మోగింది. అంతకుముందు సీతారాముల పాత్రలు ధరించిన కళాకారులను సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘనంగా సత్కరించారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి ఆశీర్వాదం తీసుకున్నారు. వారందరినీ సీఎం స్వయంగా హెలికాప్టర్​లో లక్నో నుంచి అయోధ్యకు తీసుకొచ్చారు. వరుసగా ఐదో ఏడాది కూడా రామ్‌కీ పౌడీ ఘాట్‌లో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. రామ్‌కీ పౌడీ ఘాట్‌లో దీపాల వెలుగులకు సంబందించి 12 వేల మంది వలంటీర్లు పని చేస్తున్నారు.