బాలీవుడ్ హీరో రాజీవ్ కపూర్ కన్నుమూత..

కపూర్ ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. ఒకప్పటి బాలీవుడ్ హీరో రాజీవ్ కపూర్ గుండెపోటుతో ఈ రోజు ఉదయం కన్నుమూసారు. ఆయన మృతితో కపూర్ కుటుంబంతో పాటు బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. గతేడాది రాజీవ్ కపూర్.. అన్నయ్య రిషీ కపూర్.. క్యాన్సర్‌తో కన్నుమూసి యేడాది గడవక ముందే.. ఈయన కన్నుమూయడం కపూర్ కుంటుంబానికి కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. ఈయన ఒకప్పటి బాలీవుడ్ షో మ్యాన్ రాజ్ కపూర్ చిన్న కుమారుడు. ఈయన 1983లో రాజ్ కపూర్ నట వారసుడిగా హీరోగా తెరంగేట్రం చేసాడు. ముఖ్యంగా రాజ్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామ్ తేరి గంగా మేలీ’ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం. ఈ సినిమాలో మందాకినీ స్కిన్ షో గురించి పెద్ద దుమారమే రేగింది. రాజీవ్ కపూర్ తాత .. రాజ్ కపూర్ తండ్రి పృథ్వీరాజ్ కపూర్ కూడా తొలి తరం బాలీవుడ్ సూపర్ స్టార్. ఇక రాజీవ్ కపూర్ ఇద్దరు అన్నలు రణ్‌ధీర్ కపూర్, రిషీ కపూర్‌లు హిందీ చిత్ర సీమలో హీరోలుగా సత్తా చాటారు. ఈయన మరణంపై వదిన నీతూ సింగ్ కపూర్.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు.