నిహారిక పెళ్లి వేళ చిరు ఎమోషనల్ ట్వీట్

మెగాస్టార్ చిరంజీవి ఇంట మరికొన్ని గంటల్లో పెళ్లిబాజాలు మోగనున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నటి, నిహారిక కొణిదెల వివాహ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇరు కుటుంబాలు ఇప్పటికే ఉదయ్‌పూర్‌ చేరుకున్నాయి. సోమవారం రాత్రి జరిగిన సంగీత్‌ వేడుకలో నిహారిక-చైతన్యలతో పాటు మెగా కుటుంబ సభ్యులు సందడి చేశారు. కాబోయే వధూవరులు పలు పాటలకు ముఖ్యంగా చిరంజీవి నటించిన చిత్రాల్లోని పాటలకు స్టెప్‌లు వేస్తూ తమదైన శైలిలో అలరించారు.

ఈ క్రమంలో కాబోయే దంపతులు నిహారిక, చైతన్యలకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. అంతటితో ఆగకుండా తన ప్రేమను వ్యక్తం చేస్తూ, భావోద్వేగంతో ఓ పోస్ట్ చేశారు చిరు. ట్విట్టర్‌లో మెగాస్టార్ ట్వీట్ ట్రెండింగ్ అవుతోంది. ”మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభ తరుణంలో, కాబోయే దంపతులకు ముందస్తుగా నా శుభాకాంక్షలు. ఆశీస్సులు” అని చిరంజీవి ట్వీట్ చేశారు. నిహారిక సైతం పెద్దనాన్నతో బాగా అల్లరి చేస్తుంది. పెద్దనాన్న చిరంజీవిని డాడీ అని ప్రేమగా పిలుస్తుంటుంది.