కేరళ కాంగ్రెస్ చీఫ్‌పై సీఎం పినరయి విజయన్ సంచలన ఆరోపణలు

కాంగ్రెస్ కేరళ చీఫ్ కె.సుధాకరన్‌, ముఖ్యమంత్రి పినరయి విజయన్ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుధాకరన్ చేసిన వ్యాఖ్యలు ఇద్దరి మధ్య వైరానికి కారణమయ్యాయి. ఆ తర్వాతి నుంచి ఇద్దరి మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా సీఎం విజయన్ మాట్లాడుతూ సుధాకరన్‌‌పై సంచలన  ఆరోపణలు చేశారు. ఇంతవరకు ఎవరితోనూ ఈ విషయాన్ని పంచుకోలేదన్న విజయన్.. తన పిల్లలను కిడ్నాప్ చేసేందుకు సుధాకరన్ గతంలో ప్రయత్నించారని ఆరోపించారు.

కొన్నేళ్ల క్రితం సుధాకరన్ స్నేహితుడు తమ ఇంటికి వచ్చాడని, పాఠశాలలో చదువుకుంటున్న తన పిల్లలను కిడ్నాప్ చేయాలని సుధాకరన్ తనకు చెప్పినట్టు ఆయన తనతో చెప్పాడని అన్నారు. అయితే, ఆ వ్యక్తి ఎవరన్న విషయాన్ని తాను వెల్లడించబోనన్నారు. అంతేకాదు, ఈ విషయాన్ని ఇప్పటి వరకు తన భార్యకు కూడా చెప్పలేదన్నారు. ఆమె భయపడిపోతుందన్న ఉద్దేశంతోనే చెప్పలేదని విజయన్ వివరించారు.

సీఎం విజయన్ ఆరోపణలపై సుధాకరన్ స్పందించారు. దమ్ముంటే ఆ ఆరోపణలను నిరూపించాలని సవాలు విసిరారు. ఆయన చెప్పినట్టు అది నిజమైతే అప్పుడే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం తగదన్నారు. సుధాకరన్ ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాలస్సెరీ బ్రెన్నెన్ కళాశాలలో చదువుతున్నప్పుడు విజయన్‌ను కొట్టినట్టు చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. సుధాకరన్ వ్యాఖ్యలపై విజయన్ మాట్లాడుతూ.. తనను కొట్టానని చెప్పడం సుధాకరన్ ఊహమాత్రమేనని కొట్టిపడేశారు. కేరళ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థులు సుధాకరన్‌ను కళాశాలలో నగ్నంగా నడిపించారని అన్నారు.