ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్‌

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌, ఆయన భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌లు కరోనా వైరస్ బారిన పడ్డారు. తమకు నిర్వహించిన కోవిడ్19 నిర్ధారణ పరీక్షలలో పాజిటివ్‌గా తేలిందని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. తక్షణమే రికవరీ ప్రక్రియను కూడా ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వైరస్ బారి నుంచి త్వరలోనే విముక్తి చెందుతామని కూడా ట్రంప్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతకుముందు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ వద్ద సలహాదారిణిగా సేవలందిస్తున్న హోప్ హిక్సు కరోనా వైరస్ బారిన పడింది. లక్షణాలు రావడంతో టెస్టులు చేయగా ఆమెకు పాజిటివ్‌గా తేలింది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులలో కంగారు మొదలైంది.

డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్‌లు కోవిడ్19 టెస్టులు చేయించుకున్నారు. రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేశారు. ప్రస్తుతానికి తామిద్దరం క్వారంటైన్‌లోకి వెళ్లామని అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. మరో రెండు గంటల అనంతరం తమ కోవిడ్19 టెస్టుల ఫలితాలు వచ్చాయని.. తనతో పాటు భార్య మెలానియాకు కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.