కరోనా థర్డ్ వేవ్ ముప్పు.. కోవిడ్ నిబంధనలను పొడిగించిన కేంద్రం

కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అమలవుతున్న కరోనా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. రోజువారీ కేసులు ఒకేసారిగా పెరగడంతోపాటు కరోనా థర్డ్‌ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని కేంద్రం కొవిడ్ మార్గదర్శకాలను మరో నెల రోజుల పాటు పొడగించింది. సెప్టెంబర్ 30 వరకు కరోనా నిబంధనలను అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్ లకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖలు రాశారు. కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని లేఖలో కేంద్రం తెలిపింది.

రానున్న రోజుల్లో ఎక్కువగా పండుగలు ఉన్నందున పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించింది. రద్దీ ప్రాంతాల్లో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. కరోనాను కట్టడి చేసేలా తగిన కార్యాచరణ రూపొందించాలని పేర్కొంది. పండుగల నేపథ్యంలో ఐదంచెల వ్యూహమైన టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కొవిడ్ నిబంధనలను పాటించడాన్ని కఠినంగా అమలు చేయాలని తెలిపింది. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలన్న కేంద్రం.. అవసరాలను బట్టి స్థానికంగా ఆంక్షలను అమలు చేయాలని తెలిపింది.

కాగా, భారత్‌లో కొత్త కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 46,759 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 3,26,49,947కి చేరింది. అలాగే శుక్రవారం నాడు 31,374 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశంలో కరోనాతో మరో 509 మంది మృతి చెందారు.