ధనుర్మాసం.. విశిష్టత

నేటి నుంచి ధనుర్మాసం.. మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ధనుర్మాసమంతా విష్ణు పారాయణాలతో దేవాలయాలు మారుమోగుతాయి.. మార్గశిరం ఈ మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది… మాసాలలో మార్గశిరాన్ని నేనే అని విష్ణుమూర్తి స్వయంగా చెప్పుకున్నారంటే ఈ మాసానికి వున్న వైశిష్టత అర్థమవుతుంది..

మార్గశిరం విశిష్టత..

మార్గశిరం అంటే మార్గాల్లో శ్రేష్టమైనదని అర్థం. మార్గంలో సాధనం అనగా ఉపాయాల్లో గొప్పది. మార్గం అనగా కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం. కార్తికేయుడు, కాలబైరవుడు, దత్తాత్రేయుడితోపాటు భగవద్గీత అవతరించింది కూడా ఈ మాసంలోనే కావడం విశేషం. మార్గశిర మాసం శ్రీకృష్ణతత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ మాసంలో లక్ష్మీదేవిని, నారాయణుడిని తులసి దళాలతో పూజిస్తే సకల సంపదలు కలుగుతాయని శాస్ర్తాలు చెబుతున్నాయి.

ధనుర్మాస విశిష్టత..

మార్గశిర మాసంలో ధనురాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకరరాశిలో సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. విష్ణువుకు ప్రీతిపాత్రమైన ధనుర్మాసోత్సవాన్ని వైష్ణవులు ఎంతో పవిత్ర మాసంగా భావిస్తారు. ఈనెల 16వ తేదీన ఉదయం 6:04 గంటల నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. జనవరి 14న గోదాదేవి కల్యాణంతో ముగుస్తుంది.  ధనుర్మాసం మొత్తం ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంది. తెలుగు సంస్కృతిలో ధనుర్మాసం ఒక భాగం. నెలపాటు వైష్ణవ ఆలయాల్లో విశిష్ట పూజలు నిర్వహిస్తారు. తిరుప్పావై పఠనం, గోదాకల్యాణం, ఆండాళమ్మ పూజలు నిర్వహిస్తారు. తిరుమలలో సుప్రభాతం బదులు తిరుప్పావై పఠిస్తారంటే ఈ మాసానికి ఎంత పవిత్రత ఉందో తెలుసుకోవచ్చు. దేవాలయాల్లో జరిగే ఆగమ శాస్త్ర కైంకర్యాలలో స్థానిక ఆచార, వ్యవహారాలు, సంప్రదాయాలు కలిసిన అంశాల్లో ధనుర్మాసం ఒకటి. ఈ మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతోపాటు దరిద్రం దూరమవుతుందని భక్తుల నమ్మకం.

గోదాదేవి ఆవిర్భావం..

పురాణాల ప్రకారం..దక్షిణ భారతదేశంలోని మధుర మండలంలోని శ్రీ ధన్వినవ్య నగరంలోని దినినే శ్రీవిల్లిపుత్తూరు అని అంటారు. ఇక్కడ శ్రీమహావిష్ణువు వటపత్రశాయిగా వెలిశాడు. స్వామికి నిత్య పూజలు నిర్వహించే ఆచార్యుడు పెరియార్‌ మహావిష్ణువునే నమ్ముకుని నిత్యం పూజలు చేసేవాడు. ఒక రోజు తులసి వనంలో ఒక పాప ఆచార్యుడికి దొరికింది. ఆ పాపకు కోదై అని నామకరణం చేశాడు. కోదై అంటే తమిళంలో గోదా అని అర్థం. ఈమెనే గోదాదేవిగా పిలుస్తారు. ఈమెకు మహావిష్ణువుపై విశేషమైన భక్తి. మహావిష్ణువును కృష్ణుడి రూపంగా భావిస్తూ స్వామి సేవలో తరించడమే కాకుండా తనతోపాటు ఎందరినో భక్తులుగా చేసేందుకు రోజుకో పాశురం చొప్పున నెల రోజుల పాటు 30 పాశురాలను పాడింది. ఆ భక్తితోనే స్వామిని వరించింది. ఉత్తరాయాణికి ఉషఃకాలంగా భావించబడే ధనుర్మాసంలో ముప్పై రోజుల పాటు పాశురాలు పాడి స్వామిని మెప్పించి భోగి పండుగ రోజున స్వామి వారిని పొందింది. అందుకే ఈ మాసానికి ప్రత్యేకత సంతరించుకుంది. గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు గ్రామాన్ని రేపల్లెగా భావించుకొని ఊరిలోని వారందరినీ ఉదయాన్నే నిద్రలేపి నెలరోజుల పాటు తిరుప్పావై శ్రీవ్రతాన్ని ఆచరించి ఈ లోకానికి అందించింది. దాదాపు 5 వేల సంవత్సరాల కిందట ఆచరించిన ఈ తిరుప్పావై వ్రతం నేటికీ ఆదరణ పొందుతోంది.

ఉత్తరద్వార దర్శన భాగ్యం..

పరమ పవిత్రమైన ధనుర్మాసంలో మరో ప్రత్యేకమైన రోజు ముక్కోటి ఏకాదశి. ఈ రోజున అన్ని వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకదశి పర్వదినాన ఉపవాసం ఉంటే మూడుకోట్ల ఏకదశుల వ్రతం ఆచరించినంత ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం.

తిరుప్పావై..

తిరుమలతో పాటు వేంకటేశ్వరస్వామి దేవాలయాల్లో నెల రోజుల పాటు సుప్రభాతం బదులుగా తిరుప్పావై పాశురాలను పఠిస్తారు. తిరుప్పావైలో 30 పాశురాలు ఉంటాయి. వీటిలో ఉన్న మొదటి అయిదు ఉపోద్ఘాతంగా ఉండి తిరుప్పావై ప్రాధాన్యతను వివరిస్తాయి. భగవంతుడికి చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపచారాల్లో ఆడంబరం అవసరం లేదని, చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషానిస్తాడని భక్తులు నమ్ముతారు. చివరి తొమ్మిది పాశురాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని తెలియజేస్తాయి. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి గోదాదేవి అర్పించుకుంటుంది. చివరి పాశురంలో ఫలశ్రుతి చెబుతూ ఎవరైతే ఈ పాశురాలు గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని చెబుతుంది. ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడి పేరుతోను పూజిస్తారు.

వ్రత విధాన విశిష్టత..

గోదాదేవి కల్యాణం, కాత్యాయని, శ్రీవ్రతం చేస్తే సకలశుభాలు కలుగుతాయని భక్తులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెల్లవారుజామున నిద్రలేచి భక్తిశ్రద్ధలతో ప్రతిమను తయారుచేసి నారాయణుడి ఆవాహన పూజలు చేస్తారు. రోజూ పూజకు పంచామృత స్నానం, తులసి దళాలతో అర్చన, నైవేద్యాలుగా నెయ్యి, బియ్యం, బెల్లం, మిరియాలు, పెసరపప్పు, పొంగలి, జీలకర్ర వేసి తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి. ధనుర్మాసం ప్రారంభమైన నాటి నుంచి పక్షం రోజులు ఈ నైవేద్యాలను, మిగిలిన పక్షం రోజులు దద్ధోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. సూత, శౌనకాది మహామునులు వ్రత విధానాన్ని బోధించినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ధనస్సు సంక్రమణం మొదలు మకర సంక్రమణం వరకు వ్రతాన్ని ఆచరిస్తారు. దీనిని కాత్యాయనీ వ్రతంగా కొందరు ఆచరిస్తారు. ధనుర్మాసంలో గోదారంగనాథ స్వామిని ఆరాధించడం మూలంగా సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ మాసంలో పాశురాలను చదవడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తోంది. ధనుర్మాస వ్రతం ఆచరించడం వలన చాలా పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మాసం రోజులు భగవంతుడిని ఆరాధించి పుణ్య ఫలాలను పొందాలని పండితులు సూచిస్తున్నారు.