ఓటీటీలకు రైట్స్ అమ్మకండి.. తెలంగాణా స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..

లాక్‌డౌన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 2021 జూలై 3 నుండి అక్టోబర్ 30 2021లోపు విడుదలకాబోయే సినిమాలకు సంబంధించి ఏ తెలుగు నిర్మాత కూడా తన సినిమా డిజిటల్ రైట్స్ OTTలకి అమ్మవద్దని కోరారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు. ఈ మేరకు సెక్రటరీ సునీల్ నారంగ్ ఓ ప్రెస్‌నోట్ విడుదల చేశారు.

త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు తెరిచే అవకాశం ఉన్నందున నిర్మాతలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేయకుండా OTT లో స్ట్రీమింగ్ చేయడం ద్వారా సినిమా ఇండస్ట్రీలో ఒక ముఖ్యమైన విభాగాన్ని దెబ్బతీయడంగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అభిప్రాయపడింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని థియేటర్ యజమానుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే తమ విజ్ఞప్తిని ఖాతరు చేయని నిర్మాతల పట్ల భవిష్యత్తులో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది తెలంగాణా ఫిల్మ్ చాంబర్.