అమ్మఒడిలో సైతం భారీ కోతలు

  • షరతులు వర్తిస్తాయని నాడు ఎందుకు చెప్పలేదు?
  • అర్హులైన వారికి సైతం మొండిచెయ్యి
  • ఒక్కో సంక్షేమ పథకానికి తిలోదకాలిచ్చే పనిలో వైసీపీ ప్రభుత్వం
  • జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు, మాది సంక్షేమ ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం ఒక్కో పథకాన్ని నీరు కారుస్తూ కొత్త నిబంధనల విధించి ఎంతో మందికి సంక్షేమ ఫలాలు అందకుండా చేస్తుందని ఆ కోవలోనే ఇప్పుడు అమ్మఒడి పథకాన్ని సైతం అర్హులైన లబ్ధిదారులకు అందకుండా మోసం చేస్తోందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి విమర్శించారు. అమ్మఒడి పథకానికి అర్హులు కాదంటూ ప్రకటించిన జాబితాను ఆయన పరిశీలించారు. గతంలో అమ్మఒడి పథకాన్ని తీసుకున్నవారిని సైతం ఇప్పుడు అనర్హుల జాబితాలో చేర్చటంపై ఆయన మండిపడ్డారు. ఒకసారి అర్హులైన వారు మరోసారి ఎందుకు అనర్హులవుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ పథకాన్ని వరుసగా మూడు సంవత్సరాలు తీసుకున్నవారు చాలా తక్కువ మంది ఉంటున్నారన్నారు. పాదయాత్రలో ఈ అమ్మఒడి పథకాన్ని ప్రకటించేప్పుడు షరతులు వర్తిస్తాయి అని ఎందుకు చెప్పలేదన్నారు. ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడేమో కుటుంబంలో ఒక్కరికే అని మాట మార్చారని అదికూడా ఇచ్చే పదిహేను వేల రూపాయల్లో రెండు వేలు కట్ చేస్తున్నారని విమర్శించారు. మరి సంక్షేమం పేరుతో ప్రభుత్వం చేస్తున్న లక్షల కోట్ల అప్పులు, ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మి పొగుచేసుకుంటున్న డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో ప్రజలకి సమాధానం చెప్పాలని వైసీపీ నేతల్ని కోరారు. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఏకైక లక్ష్యంతో అమలుకాని హామీలిచ్చి అన్నివర్గాల ప్రజల్ని మోసం చేసారని దుయ్యబట్టారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతల్ని ప్రజలు సంక్షేమ పథకాల నిలిపివేతపై చొక్కాలు పట్టుకొని నిలదియ్యాలని కోరారు. జవాబుదారీతనం, పారదర్శకత లేని వైసీపీ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆళ్ళ హరి అన్నారు.