అంతరిక్షంలో తొలి సినిమా షూటింగ్‌ పూర్తి – భూమికి తిరిగొచ్చిన రష్యా నటి, డైరెక్టర్‌

అంతరిక్ష కక్ష్యలో తొలిసారిగా సినిమా షూటింగ్‌ జరిగింది. ఇందుకు సంబంధించి ‘ది ఛాలెంజ్‌’ అనే సినిమా సీన్ల చిత్రీకరణ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో 12 రోజుల పాటు గడిపిన అనంతరం రష్యాకు చెందిన నటి యులియా పెరెసిల్ద్‌ , డైరెక్టర్‌ క్లిమ్‌ షిపెంకో ఆదివారం నాడు భూమికి తిరిగివచ్చారు. ముందుకు అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం వీరు కజకిస్తాన్‌కు చెందిన స్టెప్పేలో క్యాప్సూల్‌ ద్వారా ల్యాండయ్యారు. 12 రోజుల పాటు పొందిన అంతరిక్షం అనుభవాన్ని వీడే క్రమంలో షిపెంకో కొంత బాధగా కనిపించినప్పటికీ, క్యాప్సూల్‌ నుంచి బయటకు వచ్చే సమయంలో నవ్వుతూ చేతులు ఊపారు. సినిమాలో స్టార్‌ రోల్‌ పోషిస్తున్న పెరెసిల్డ్‌ను 3 వేల మంది దరఖాస్తుదారుల నుంచి ఎంపిక చేశారు. క్యాప్సూల్‌ నుంచి బయటకు వచ్చిన ఆమెకు అక్కడున్న వారు పూలబకేలతో అభినందనలు తెలిపారు. అనంతరం వీరిద్దరిని డాక్టర్లు ఆయన్ను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని వీడి రావడం చాలా బాధగా ఉందని నటి పెరెసిల్డ్‌ పేర్కొన్నారు. ” ముందుకు 12 రోజులు అనేది చాలా ఎక్కువ అనుకున్నాం. అయితే ఆ సమయంలో అయిపోయాక తిరిగి రావాలని అనిపించలేదు” అని రష్యా టెలివిజన్‌తో అన్నారు. ఏదేమైనా ఇది ఒక మంచి అనుభవం అని ఆనందం వ్యక్తం చేశారు. సినిమా సీన్ల చిత్రీకరణ కోసం ఈ నెల మొదట్లో రష్యా లీజుకు తీసుకున్న కజకిస్తాన్‌లోని బైకోనూర్‌ కాస్మోడ్రోమ్‌ నుంచి సీనియర్‌ వ్యోమగామి అంటోన్‌ షకాప్లెరోవ్‌తో కలిసి ఐఎస్‌ఎస్‌కు బయలుదేరారు. ఈ ప్రాజెక్ట్‌ ఇలానే ట్రాక్‌లో ఉంటే గనుక, గత సంవత్సరం ”మిషన్‌ ఇంపాజిబుల్‌” స్టార్‌ టామ్‌ క్రూజ్‌ నాసా, ఎలోన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో కలిసి ప్రకటించిన హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ను రష్యన్లు బీట్‌ చేసే అవకాశం ఉంది.