కాలినడకదారిలో ఇరు వైపుల కంచె ఏర్పాటు చేయాలి: తులసి ప్రసాద్

పూతలపట్టు: కొద్దిరోజుల క్రితం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం తన వారితో కలిసి నడకదారిన వెళ్లిన ఒక చిన్నారి క్రూర మృగాల బారినపడి మృతి చెందడం చాలా బాధాకరం అని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వారి కుటుంబానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయని ప్రార్థిస్తున్నాను. ఈ విషయమై తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యం ప్రవర్తిస్తున్న తీరు చాలా దురదృష్టకరం. కాపాడుకోలేకపోయిన ప్రాణానికి వెలకట్టడం కంటి తడుపు చర్యగా భావిస్తున్నాం. దేవస్థానం యాజమాన్యం భక్తుల రక్షణ గురించి ఏమాత్రం ఆలోచన చేయకుండా, ఒక చేతి కర్రలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉన్నది. కాలినడక కొంత సమయం తర్వాత సురక్షితం కాదని, చిన్నపిల్లలకు ప్రవేశం లేదని రకరకాల వార్తలు వింటున్నాం, ఏదో పథకం ప్రకారం భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆలయ యాజమాన్య చర్యలు ఉన్నాయి. భక్తుల సౌకర్యార్థం కాలినడకదారిలో ఇరు వైపుల కంచెను ఏర్పాటు చేసి, రక్షణగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి భక్తుల మనోధైర్యాన్ని పెంచాలని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ కోరారు.