ఆఫ్ఘన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు, వివిధ శాఖల కీలక మంత్రులు వీరే

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఇరవయ్యేళ్ల అనంతరం ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు కొత్త ప్రధానిగా ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్‌ను ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని కొత్త ప్రభుత్వంలో కీలక మంత్రులు, శాఖల వివరాలు ఇలా ఉన్నాయి.

ఆఫ్ఘనిస్తాన్‌లో ఎట్టకేలకు మూడు వారాల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ ప్రధానిగా మరో 8 మంది వివిధ శాఖలకు కీలక మంత్రులుగా వ్యవహరించనున్నట్టు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. దాదాపు 20 ఏళ్లపాటు అగ్రనేతలతో పోరాడిన తాలిబన్ అగ్రనేతలు కొత్త ప్రభుత్వంలో కీలక పదవులు పొందారు. అమెరికాతో జరిగిన చర్చల్లో కీలక పాత్ర పోషించిన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్, మౌల్వీ హనాఫీలు డిప్యూటీ ప్రధాన మంత్రులుగా ఉండనున్నారు. అయితే ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వం తాత్కాలికమేనని..దేశంలోని ఇతర ప్రాంతాలవారిని సైతం కలుపుకునేందుకు ప్రయత్నిస్తామని జబీహుల్లా ముజాహిద్ తెలిపారు.

ఆఫ్ఘనిస్తాన్ కొత్త ప్రభుత్వంలో ప్రతి మంత్రికి ఇద్దరు సహాయమంత్రులు ఉండనున్నారు. ఆప్ఘనిస్తాన్ కొత్త ప్రభుత్వంలో అన్నివర్గాల ప్రాతినిధ్యం ఉండాలనేది అంతర్జాతీయ సమాజం ఆలోచనగా ఉంది. ప్రభుత్వ కూర్పు, అధికార పంపిణీల విషంయలో తాలిబన్లు, హక్కానీ గ్రూప్ మధ్య తీవ్రమైన విభేధాలు తలెత్తాయి. అబ్దుల్ ఘనీ బరాదర్ ప్రభుత్వాధినేతగా హక్కానీ గ్రూప్ వ్యతిరేకించడంతో పాకిస్తాన్ ఐఎస్ఐ ఛీప్ మధ్యవర్తిత్వం నిర్వహించారు. ఇరువురి మధ్య చర్చల అనంతరం హసన్ అఖుంద్‌కు తాత్కాలికంగా ప్రభుత్వ పగ్గాలు అప్పగించారు. తాత్కాలిక మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించలేదు. ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ ఛీఫ్ గా ఖారీ ఫసిహుద్దీన్‌ను నియమించారు. తాలిబన్ అధినేత హెబతుల్లా అఖుంద్ జాదా సుప్రీం నేతగా ఇరాన్ మోడల్ ప్రభుత్వం ఏర్పడనుందని భావించారు కానీ..ఇంకా స్పష్టత రాలేదు.

ఆఫ్ఘనిస్తాన్ కొత్త ప్రభుత్వంలో వివిధ శాఖల మంత్రులు వీరే
అమీర్ ఖాన్ విదేశాంగమంత్రి
షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానెక్ జాయ్ విదేశాంగ సహాయమంత్రి
సిరాజుద్దీన్ హక్కానీ హోంశాఖ మంత్రి
ముల్లా యూకూబ్ రక్షణ మంత్రి
అబ్దుల్లా హకీం షరే న్యాయశాఖ మంత్రి
హిదాయతుల్లా బద్రి ఆర్ధిక మంత్రి
షేక్ మవ్లానీ నూరుల్లా విద్యాశాఖ మంత్రి
నూర్ మహ్మద్ సాకిబ్ మతవ్యవహారాల శాఖ మంత్రి
ఆఫ్ఘనిస్తాన్ కొత్త ప్రధానిగా ఎంపికైన ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్ తాలిబన్ వ్యవస్థాపకుడైన ముల్లా ఒమర్‌కు అత్యంత సన్నిహితుడు. తాలిబన్ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా పనిచేశారు. తాలిబన్ కమాండర్లలో అత్యంత సమర్ధవంతుడిని ఐక్యరాజ్యసమితి తెలిపింది. అఖుంద్ పేరును తాలిబన్ అగ్రనేత ముల్లా హెబతుల్లా అఖుంద్ జాదా స్వయంగా ప్రతిపాదించినట్టు సమాచారం.