కొవిడ్-19తో అనాథలైన చిన్నారులకు ఉచిత విద్య, ఆరోగ్య బీమా

న్యూఢిల్లీ: కొవిడ్-19తో తల్లితండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ కింద ఉదారంగా ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. కరోనాతో పలువురు చిన్నారులు తమ తల్లితండ్రులను, సంరక్షకులను కోల్పోయారని, వీరందరూ గౌరవంతో బతుకుతూ మెరుగైన అవకాశాలు దక్కించుకునేలా ప్రభుత్వం చొరవ చూపుతుందని ప్రధాని ట్వీట్ చేశారు.

పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ఇలాంటి పిల్లలకు మెరుగైన విద్య, ఆరోగ్య బీమా వంటి వసతులను సమకూరుస్తుందని పేర్కొన్నారు. అనాథ పిల్లల పేరిట ప్రభుత్వం ఫిక్స్ డ్ డిపాజిట్లు ఓపెన్ చేస్తుందని, ఓ ప్రత్యేక పధకం ద్వారా వారు 18 ఏండ్ల వయసుకు వచ్చే సరికి వారికి రూ 10 లక్షల నిధి సమకూరేలా ఏర్పాటు చేస్తుందని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.