గ్రామపంచాయతీల నుంచి మళ్లించిన నిధులు పంచాయతీ ఖాతాలలో జమచేయాలి -అంజూరు చక్రధర్

రాష్ట్రవ్యాప్తంగా 12,918 పంచాయతీల నుంచి ఈ రెండున్నరేళ్ళ పాలనలో రూ.1309 కోట్లకు పైగా నిధులు మళ్లించడంను జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా అంజూరు చక్రధర్ మాట్లాడుతూ కనీసం పంచాయతీ పారిశుద్ధ్య పనులకి కూడా రూపాయి లేని దుస్థితిలో ఈరోజు గ్రామాలు ఉన్నాయి.గ్రామాల్లో రోడ్లు, డ్రైన్, త్రాగునీరు, శానిటేషన్, లైటింగ్ పనుల కోసం గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 14, 15వ ఆర్ధిక సంఘాల ద్వారా కేటాయించిన నిధులని తరలించుకు పోవడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మోసానికి గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయాయి.పల్లెల్లో పారిశుద్ధ్య పరిస్థితి పూర్తిగా దిగజారింది. పల్లె ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు నేరుగా ఇచ్చిన రూ.1309 కోట్లను పంచాయతీ ఖాతాల నుంచి మళ్లించడం రాజ్యాంగ విరుద్ధం. 4నెలల క్రితం 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.344 కోట్లను విద్యుత్ బకాయిల క్రింద జమ చేసుకున్నామని, ఇప్పుడు ఆర్థికమంత్రి ప్రకటించిడం బాధ్యతారాహిత్యం.రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్, మైనింగ్ సెస్,వృత్తి పన్ను,తలసరి గ్రాంట్, నీటితీరువా పన్ను,ఇసుకమైనింగ్ పై వచ్చె ఆదాయాలు వేల కోట్లు ఎగవేసి, ఇప్పుడు కేంద్రం ఇచ్చిన నిధులు కూడా వాడేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ రాష్ట్రనికి ముఖ్యమంత్రి ఎలానో , గ్రామానికి సర్పంచ్ కూడా అంతే.

14వ ఆర్ధిక సంఘం కేటాయించిన నిధుల నుండి మళ్లించిన రూ.344 కోట్లు.15వ ఆర్థిక సంఘము కేటాయించిన నిధుల నుండి మళ్లించిన రూ.965 కోట్లు తక్షణమే పంచాయతీల ఖాతాల్లో జమచేయాలి.అలాగే రాజకీయాధిపత్యం కోసం ప్రకటించిన ఏకగ్రీవాల పారితోషకం కూడా పంచాయతీలకు విడుదల చేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు.