మెగా అభిమానులకు శుభవార్త.. పూర్తిగా కోలుకున్న సాయి తేజ్‌

మెగా అభిమానులకు నిజంగా ఇది శుభవార్తే. రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో సాయి తేజ్ పూర్తిగా కోలుకున్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తేజ్‌ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చామని.. ఇప్పుడు సొంతంగా శ్వాస తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అందరితో మాట్లాడగలుగుతున్నారని తెలిపింది. మరో రెండు లేదా మూడు రోజుల్లో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయనున్నట్లు పేర్కొంది.

సెప్టెంబర్ 10 వినాయక చవితి రోజు రాత్రి ఎనిమిది గంటలకు సాయి తేజ్ కేబుల్ బ్రిడ్జ్‌-ఐకియా మార్గంలో బైక్‌పై వెళుతున్నక్రమంలో రహదారిపై ఇసుక ఉండటం వల్ల బైక్‌ స్కిడ్‌ అయ్యింది. దీంతో తేజ్ వాహనాన్ని అదుపు చేయలేక పడిపోయాడు. ప్రమాదంలో సాయిధరమ్‌ తేజ్‌ కుడి కంటి పైభాగంతో పాటు ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను మెడికవర్ ఆసుపత్రికి ప్రాథమిక చికిత్స కోసం తరలించారు. అనంతరం అపోలో హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు. ప్రత్యేక వైద్య బృందం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ.. ఆయన కాలర్ బోన్ ఆపరేషన్ కూడా చేశారు.

ఇదిలా ఉంటే.. సాయి తేజ్ నటించిన రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1న విడుదల కానుంది. ఈ చిత్రంలో సాయితేజ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రం కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.