లడఖ్‌లో సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

లడఖ్‌ ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోదీ ఓ బహుమతి ఇవ్వనున్నారు. లడఖ్‌లో మొట్ట మొదటి సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి దాదాపు సంవత్సరం కావస్తున్న నేపథ్యంలో ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ యూనివర్శిటీ లో ఓ ‘బౌద్ధ అధ్యయన కేంద్రా’న్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక, ఆ యూనివర్శిటీ ఇంజనీరింగ్, వైద్య విద్య మినహా… బేసిక్ సైన్సెస్ వంటి అన్ని కోర్సులలోనూ డిగ్రీలను అందింస్తుంది.

లడఖ్‌లో సెంట్రల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర మానవ వనరుల శాఖ అతి త్వరలో ఓ అధికారిక ప్రతిపాదనను తీసుకురానుంది. దానికి కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత పార్లమెంటు ముందుకు వెళ్తుంది. కేంద్ర పాలిత ప్రాంతాలుగా లడఖ్, జమ్మూ ఏర్పడి సంవత్సరం పూర్తైన సందర్భంగా అక్కడ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష సమావేశం నిర్వహించగా… దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, విదేశాంగ మంత్రి జయశంకర్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలోనే లడఖ్‌లో సెంట్రల్ యూనివర్శిటీని కేటాయిస్తూ ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.