గుప్పెడు గంగకు జనం కటకట

మదనపల్లె, గుప్పెడు నీరు కోసం పల్లె ప్రజల గొంతు ఎండిపోతోంది. దాహార్తి తీరే దారి లేక జనం డబ్బాలు కట్టుకొని బిందెలు పట్టుకుని చెరువులు, బావుల వెంట పరిగెత్తాల్సిన దుస్థితి ఏర్పడింది. బీదా బిక్కి కూడా నెలకు ఆరేడు వందల రూపాయల ఖర్చు పెడితే తప్ప గొంతు తడిసే దారిలేని పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పల్లెల్లో తాండవిస్తోంది. నీటి కొరత తీరుస్తామని హామీలు ఇచ్చిన నేతలు గద్దెనెక్కాక జనం గోడు పట్టించుకోక పోయారు. ఊటచెలమలో, బావుల్లో రంగుమారిన, పాచిపట్టిన నీరే దిక్కవుతోంది. తాగునీరు అందించే బోర్లు రక్షిత పథకాలు ఏళ్ల తరబడి పని చేయకున్నా నిధులు లేకపోతే మేమేం చేస్తాం అంటూ గ్రామీణ నీటి సరఫరా విభాగం ఉత్త చేతులు చూపిస్తోంది. పల్లె ప్రజలు మండువేసవిలో తాగునీటికి అల్లాడిపోతున్నారు. మంచినీటి పథకాలు లేక కొన్ని చోట్ల ఉన్నవి మూలనపడి, మరికొన్నిచోట్ల దాహార్తితో జనం అలమటిస్తున్నారు. నెత్తిన బిందెలు పట్టుకొని మహిళలు బావులు, చెరువులకు వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. కూలీ, నాలీ చేసుకుని బ్రతికే బడుగు బలహీన జీవులు సైతం ఆర్ఓ ప్లాంట్ కి వెళ్లి మంచినీళ్లు కొనుక్కోవాల్సి వస్తోంది. తాగునీరు అందించే రక్షిత పథకాలు ఏళ్ళ తరబడి పని చేయకపోయినా మరమ్మతులు ఊసుఎత్తని పాలకుల నిర్లక్ష్యం సాక్షిగా రాష్ట్రవ్యాప్తంగా పల్లె ప్రజలు తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. రాష్ట్రంలోఎక్కడ చూసినా నీటికోసం జనం పడుతున్న కష్టాలే కనిపిస్తున్నాయి. నీటికి నీటికోసం కేటాయించాల్సిన నిధులను విద్యుత్ ఛార్జీల బకాయిలకు దాదాపు తొమ్మిది వందల కోట్లను మళ్లించి నీటి పథకాల నిర్వహణ పై నిర్లక్ష్యం చేయడమే ఈ యొక్క దుస్థితికి కారణమని చిత్తూరు జిల్లా జనసేన కార్యదర్శి దారం అనిత అన్నారు.