బోగస్ ఓట్లతో భారీ కుట్ర!

* రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది దొంగ ఓట్లు
* ఇష్టారాజ్యంగా ఓటర్ల జాబితా సవరణ
* భారీ కుట్రకు తెరతీసిన వైసీపీ
* అధికార పార్టీతో అంటకాగుతున్న ఎన్నికల అధికారులు
* కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌
* దొంగ ఓట్ల దందాకు రుజువులు లభ్యం

సరిగ్గా చదువుకోని విద్యార్థి పరీక్షలో ఎలాగైనా ప్యాసవ్వాలనుకుంటే ఏం చేస్తాడు?
స్లిప్పులు పెట్టి జవాబులు రాసేద్దామని చూస్తాడు!
అందుకోసం ఇన్విజిలేటర్‌ ని కూడా వాడుకోవాలని చూస్తాడు!
సరిగ్గా అలాంటి జగమొండి మొద్దబ్బాయిలాగే వ్యవహరిస్తోంది ఎన్నికల్లో ఎలాగోలా గెలవాలని చూస్తున్న జగన్‌ ప్రభుత్వం. అందుకోసం అది ఎంచుకున్న మార్గం దొంగ ఓట్లు!
స్థానికంగా ఉండే ఎన్నికల సంఘం సభ్యులు, అధికార యంత్రాంగాన్ని బెదిరించో, ప్రలోభాలకు గురి చేసో రాష్ట్రవ్యాప్తంగా దొంగ ఓట్లను నమోదు చేసే భారీ కుట్రకు తెర తీసింది.
అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా ఎక్కడికక్కడ దొంగ ఓట్లతో కూడిన ఓటర్ల జాబితాలు బయటపడుతున్నాయి!
కేంద్ర ఎన్నికల సంఘానికి కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు అందుతున్నాయి!
జాతీయ అధికారుల ప్రత్యక్ష పరిశీలనలో అవకతవకలు బయటపడుతున్నాయి!
దానికి బాధ్యులైన ఎన్నికల అధికారులపై వేటు కూడా పడుతోంది!
ఇలా… అధికారాన్నిఅడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్య విధానాలను తుంగలో తొక్కే దుర్మార్గానికి జగన్‌ ప్రభుత్వం నిస్సిగ్గుగా ఒడికడుతోందని చెప్పేందుకు అనేక దృష్టాంతరాలు కనిపిస్తున్నాయి!
* అవకతవకల అడుగుజాడలివిగో!
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 3,99,84,868 మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర చీఫ్‌ ఎన్నికల అధికారి ఈ ఏడాది జనవరిలో ప్రకటించారు. వీరిలో దాదాపు మూడు లక్షల మంది కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఉన్నారు. మొత్తం ఓటర్లలో చనిపోయిన వారు, వేరే ప్రాంతాలకు వలస పోయిన వారు ఉంటారు కాబట్టి ఓటర్ల జాబితాలో ఆ మేరకు ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు ఉంటాయనేది అందరికీ తెలిసిందే. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం మీదనే ఆధార పడక తప్పని పరిస్థితి. దాంతో ఇలాంటి సవరణలను ఆధారం చేసుకుని జగన్‌ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఓటర్లను తొలగించడం, కొత్త వారిని చేర్చుకోవడం చేస్తోందనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచే కాదు, ప్రజానీకం నుంచి కూడా గుప్పుమంటున్నాయి. నిజానికి ఒక ఓటును తొలగించాలంటే నిబంధనల ప్రకారం ఎంతో తతంగం ఉంటుంది. అధికారులు ఆ ఓటరు చిరునామాకు నోటీసు పంపాల్సి ఉంటుంది. ఆ ఓటరు నుంచి అభ్యంతరం లేకపోయినప్పుడో, ప్రత్యక్ష పరిశీలనలో సదరు ఓటరు లేడని తేలితేనో మాత్రమే ఆ ఓటును తొలిగించాలి. అయితే అలాంటి ప్రక్రియ ఏదీ చేపట్టకుండానే జగన్‌ ప్రభుత్వం స్థానిక ఓట్ల నమోదు అధికారులను లోబరుచుకుని ఓటర్ల జాబితాలో భారీ అవకతవకలకు పాల్పడుతోందనేది ప్రధాన ఆరోపణ. ఇది నిజమేనని చెప్పడానికి ఎక్కడికక్కడ బయటకొస్తున్న ఓటర్ల జాబితాను పరిశీలిస్తే ఇట్టే తెలిసిపోతోంది.
– ఒక ఇంట్లో అయిదారుగురు సభ్యులు ఉంటారు. పోనీ ఉమ్మడి కుటుంబమయితే ఓ పది మంది ఉంటారనుకోవచ్చు. కానీ ఎక్కడైనా ఒకే ఇంట్లో 706 మంది ఉంటారా? మరో ఇంట్లో 644 మంది ఉంటారా? కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో బయట పడిన విచిత్రమిది.
– ఇదే జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో పురపాలక దస్త్రాల్లోనే లేని ఇంటి నెంబరుతో ఏకంగా 103 మంది ఓటర్ల ఉన్నట్లు నమోదైంది.
– విశాఖలో ఒక రేకుల షెడ్డులో 66 మంది ఓటర్లు ఉన్నట్టు జాబితా బయటపడింది.
– అనకాపల్లి నియోజకవర్గం తీడలో ఒక ఇంట్లో ఏడుగురు ఉంటుండగా, తాజా సవరణల ప్రకారం అదే ఇంట్లో 30 మంది ఉన్నారు.
– కృష్టా జిల్లా పెడనలోని ఒక్కో ఇంట్లో 138 మంది, 65 మంది, 48 మంది, 34 మంది ఓట్లు ఉన్న జాబితా బయట పడి సంచలనం సృష్టించింది.
– పుంగనూరులో అయితే అసలు ఇంటి నెంబర్లు లేకుండానే 2000 ఓట్లు ఉన్నట్టు తేలింది.
– అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఒకే ఇంట్లో 181 ఓట్లు బయటపడ్డాయి.
– అసలు సున్నా నెంబరుతో ఏ ఇల్లయినా ఉంటుందా? అలాంటిది 00, 0-00 డోర్‌ నెంబర్లతో ఓట్లు ఉన్నట్టు జాబితాలు పరిశీలిస్తే తెలుస్తోంది. రాప్తాడులో ఇలా 2498 ఓట్లు ఉన్నట్టు తేలింది.
– అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో 17 వేలకు పైగా నకిలీ ఓట్లు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
– తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఏకంగా 19 వేల దొంగ ఓట్లు ఉన్నట్టు జాబితా పరిశీలన ద్వారా తెలుస్తోంది.
ఇలా చెప్పుకుంటూ పోతే… ఒకటి కాదు, రెండు కాదు రాష్ట్రవ్యాప్తంగా లక్షల దొంగ ఓట్లు నమోదయ్యాయంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం ప్రజాస్వామ్య వాదులందరినీ విస్మయానికి గురి చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ కనీసం 10 వేల దొంగ ఓట్లను నమోదు చేయాలని వైకాపా ప్రభుత్వం కుట్ర చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఎలుగెత్తి చాటుతున్నాయి. దొంగ ఓట్ల నమోదు నిజమేననడానికి నిదర్శనాలు కూడా అనేకం ఉన్నాయి. ఉదాహరణకు అనంతపురంలో దొంగ ఓట్ల గురించి ఉరవకొండ ఎమ్మెల్యే అనేక ఫిర్యాదులు చేసి, స్థానిక అధికారుల్లో స్పందన కనిపించకపోవడంతో ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి రుజువులతో సహా పిటీషను దాఖలు చేశారు. దాంతో కేంద్రం నుంచి ప్రత్యేక అధికారులు వచ్చి ప్రత్యక్ష పరిశీలన జరిపితే వేలాది దొంగ ఓట్లు నమోదయినట్టు తేలింది. దాంతో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి భాస్కరరెడ్డిని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. ఈ విషయం తెలిసి కేంద్ర ఎన్నికల సంఘం గట్టిగా ఆదేశాలు ఇవ్వడంతో ఆఖరికి భాస్కర రెడ్డిని సస్పెండు చేశారు. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి మరో అధికారిణి శోభా స్వరూపారాణి సైతం సస్పెన్షన్‌ కి గురవడంతో దొంగ ఓట్ల ప్రహసనం అధికార పార్టీ అండదండలతో, వైకాపా ప్రభుత్వం ప్రోత్సాహంతో నిరంతరంగా సాగుతోందనడానికి ప్రబల సాక్ష్యం లభించినట్లయింది.
*అసలు ఏం జరుగుతోంది?
చదువుకోని విద్యార్థి ప్యాసవడానికి దొంగ దార్లు ఎన్నుకున్నట్టే, రాబోయే ఎన్నికల్లో ఎలాగోలా గెలవాలనే ఉద్దేశంతో జగన్‌ ప్రభుత్వం కుయత్నాలు చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలకు ఓటేస్తారని అనుమానం ఉన్న ఓట్లను జాబితా నుంచి తొలగించడమో, ఒక కుటుంబంలోని ఓట్లను రెండు మూడు బూత్‌ల పరిధికి మార్చడమో లాంటి అవకతవకలు అనేకం జరుగుతున్నాయి. అలాగే ఏదో ఒక దొంగ చిరునామాతో వందల కొద్దీ దొంగ ఓటర్లను నమోదు చేయిస్తున్నారని కూడా బయటపడుతోంది. ఇలాంటి కుయత్నాలను అడ్డుకోవాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, యంత్రాంగం మొద్దు నిద్ర పోతుండడం కూడా ఇందుకు దోహదం చేస్తోంది. అధికార పార్టీ నేతలు ఎక్కడికక్కడ ఎలక్టోరల్‌ రిజిష్ట్రేషన్‌ అధికారులను లోబరుచుకుని తమ ఇష్టారాజ్యంగా ఓటర్ల జాబితాలో అక్రమ సవరణలు చేపట్టారనడానికి అనేక ఉదాహరణలు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి అవకతవకలు బయటపడినప్పుడల్లా స్థానిక ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకోవడం కానీ, జిల్లా ఎన్నిక అధికారులుగా వ్యవహరించే కలెక్టర్లను ప్రశ్నించడం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార యంత్రాంగం చేయడం లేదు. మరీ తప్పకపోతే ఏదో మొక్కుబడిగా చర్యలు తీసుకుని వదిలేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. విశాఖపట్నం తూర్పు నియోజక వర్గం పరిధిలో 40 వేలకు పైగా ఓట్లను తొలగించారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడితే, ఏదో పరిశీలన చేసినట్లు చేసి కేవలం 22 ఓట్లే తొలగించారంటూ తేల్చేసి, ముగ్గురు చిన్నస్థాయి అధికారులపై నామమాత్రంగా చర్యలు తీసుకుని సరిపెట్టేశారు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ ఓటర్ల జాబితాల్లో సవరణల పేరిట వైకాపా ప్రభుత్వం దొంగ ఓట్లను చేరుస్తూ, నిజమైన ఓటర్లను తొలగిస్తూ భారీ కుట్రకు పాల్పడుతోందనడానికి అనేక దృష్టాంతరాలు కనిపిస్తున్నాయి.
”ఓటర్ల జాబితా తయారీ అనేది అత్యంత జాగురూకతతో నిర్వహించాల్సిన ఓ పవిత్ర యజ్క్షం లాంటిది” అంటూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఎప్పుడో నిర్వచించారు.
అయితే… గెలవడమే పరమావధిగా ఎలాంటి అక్రమాలకైనా సిద్ధమయ్యే వైకాపా నాయకులకు, వారిని వెనుకనుంచి నడిపించే జగన్‌ లాంటి అధినేతలకు ఇలాంటి స్ఫూర్తిదాయకమైన సూక్తులు చెవికెక్కుతాయా?