రెండో రోజు ముగిసిన ఆట.. 89 పరుగుల ఆధిక్యంలో భారత్‌!

అహ్మదాబాద్‌ : మోతేరా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో రిషభ్‌ పంత్‌ చెలరేగిపోయాడు. సూపర్‌ హిట్టింగ్‌.. కళ్లు చెదిరే షాట్లతో అదిరిపోయే సెంచరీ చేశాడు. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన మోతేరాలో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా పంత్‌ రికార్డు సృష్టించాడు. అంతేకాదు రిషభ్‌కు సొంతగడ్డపై ఇది తొలి శతకం. 82 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన పంత్‌.. ఆ తరువాత కేవలం 33 బంతుల్లోనే మరో 50 పరుగులు తీసి మొత్తంగా 117 బంతుల్లో 100 పరుగులు చేశాడు. కొత్త బంతి తీసుకున్న తరువాత స్టోక్స్‌, అండర్సన్‌ బౌలింగ్‌లో కళ్లుచెదిరే బౌండరీలు బాదాడు. పంత్‌ బ్యాటింగ్‌ శైలి చూస్తున్నంతసేపూ క్రీడాభిమానులు అదో టెస్ట్‌ మ్యాచ్‌లా కాకుండా వన్డే లేదా టి20 మ్యాచ్‌లా జరిగిందని భావించారు. అయితే సెంచరీ చేసిన తరువాత ఒక్క పరుగు మాత్రమే చేసి పంత్‌ ఔటయ్యాడు. అండర్సన్‌ వేసిన బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీంతో ఏడో వికెట్‌కు పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌ కలిసి 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

89 పరుగుల ఆధిక్యంలో భారత్‌..

24/1 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో టీమిండియా రెండో ఆటను రోహిత్‌ శర్మ, పుజారాతో ప్రారంభించింది. అంతకుముందు ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో గురువారం 205 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌ తొలి ఓవర్‌లోనే శుభ్‌మన్‌ గిల్‌ (0)వికెట్‌ కోల్పోయింది. శుక్రవారం రెండో రోజు జాక్‌ లీచ్‌ వేసిన 24వ ఓవర్‌లో పుజారా (17) ఎల్‌బిడబ్ల్యూగా వెనుదిరిగాడు. పుజారా రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది. వెంటనే బెన్‌స్టోక్స్‌ వేసిన 26.4 బంతికి కెప్టెన్‌ కోహ్లీ (0) డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. జట్టు స్కోర్‌ 41 పరుగుల వద్ద కోహ్లీ ఔటవ్వడంతో భారత్‌ కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రహానే ధాటిగా ఆడాడు. దీంతో భోజన విరామ సమయానికి భారత్‌ 80/4 పరుగులతో నిలిచింది. వికెట్‌ పడకుండా జోడీ కట్టిన రోహిత్‌ శర్మ, రహానే 45వ ఓవర్‌లో జట్టు స్కోర్‌ 100 దాటించారు. అనంతరం రోహిత్‌ (49) తృటిలో అర్ధసెంచరీ మిస్‌ చేసుకున్నాడు. బెన్‌స్టోక్స్‌ వేసిన 50వ ఓవర్‌లో ఎల్‌బిడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 121 పరుగుల వద్ద భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. ఆ తరువాత అశ్విన్‌ (13) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడబోయి పోప్‌ చేతికి చిక్కాడు. దీంతో జట్టు స్కోర్‌ 146 పరుగుల వద్ద ఇండియా ఆరో వికెట్‌ కోల్పోయింది. అనంతరం 62 ఓవర్ల వద్ద టీ బ్రేక్‌ ప్రకటించారు. అప్పటికి భారత్‌ స్కోర్‌ 153/6గా ఉంది. ప్రస్తుతం క్రీజులో రిషభ్‌ పంత్‌ మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. వికెట్‌ ఇవ్వకుండా వాషింగ్టన్‌ సుందర్‌తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సెంచరీ చేసిన అనంతరం పంత్‌ (101 : 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) అండర్సన్‌ వేసిన బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయి రూట్‌ చేతికి చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌తో జతకట్టిన వాషింగ్టన్‌ సుందర్‌ అర్ధసెంచరీ పూర్తి చేశాడు.

సుందర్‌ అర్ధ శతకం..

పంత్‌తో కలిసి 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన వాషింగ్టన్‌ సుందర్‌ ఆచీతూచీ ఆడుతూ.. చెత్త బంతులను బౌండరీలు బాదుతూ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సుందర్‌ (60) పరుగులతో నిలిచాడు. మరో బ్యాట్స్‌మెన్‌ అక్షర్‌ పటేల్‌ (11) పరుగులతో నిలిచాడు. దీంతో భారత్‌ రెండో రోజు ఆట ముగిసే సరికి 294/7 వికెట్లతో నిలిచింది. భారత్‌కు 89 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో జేమ్స్‌ అండర్సన్‌ 3 వికెట్లు పడగొట్టగా.. బెన్‌ స్టోక్స్‌, జాక్‌ లీచ్‌ తలా రెండు వికెట్లు తీశారు.