IPL 2021: ముంబై ఇండియన్స్‌ అద్భుత విజయం..

ఢిల్లీ: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో బౌలింగ్‌, బ్యాటింగ్‌లో గొప్ప ప్రదర్శన చేసిన ముంబై ఇండియన్స్‌ అద్భుత విజయం సాధించింది. గురువారం అరుణ్‌ జైట్లీ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 172 పరుగుల ఛేదనలో క్వింటన్‌ డికాక్‌(70 నాటౌట్‌: 50 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో రాణించగా లక్ష్యాన్ని ముంబై 18.3 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది కృనాల్‌ పాండ్య(39: 26 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఛేదనలో ముంబై ఏ దశలోనూ తడబడలేదు. రోహిత్‌(14) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా డికాక్‌, కృనాల్‌ చెలరేగిపోయారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు

పెట్టించారు. రాజస్థాన్‌ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ డికాక్‌ జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. రాజస్థాన్‌ బౌలర్లలో క్రిస్‌ మోరీస్‌ రెండు వికెట్లు తీయగా ముస్తాఫిజుర్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

అంతకుముందు రాజస్థాన్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌(41: 32 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు), జైశ్వాల్‌(32: 20 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు), సంజూ శాంసన్‌(42: 27 బంతుల్లో 5ఫోర్లు), శివమ్‌ దూబే(35: 31 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) కీలక ప్రదర్శన చేశారు.