జగన్‌ చీఫ్‌ మినిస్టర్‌ కాదు.. చీప్‌ మినిస్టర్‌: మనుక్రాంత్‌రెడ్డి

నెల్లూరు, రాష్ట్రంలోని ప్రజలు, మహిళలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని ఛీదరించుకుంటున్నారని, జగన్‌ చీఫ్‌ మినిస్టర్‌ కాదు. చీప్‌ మినిస్టర్‌ అని జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్‌రెడ్డి విమర్శించారు. గురువారం నగరంలోని జనసేన జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌ ఏ సమావేశాన్ని అయినా రాజకీయ సమావేశంగా చేసి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చేతగాని వ్యక్తి సీఎం అయితే రాష్ట్రం ఏ విధంగా అధోగతిపాలు అవుతుందో ప్రజలందరూ చూస్తున్నారన్నారు. సమాజంలో మార్పు రావాలని ఎంతోమంది చూస్తున్నారన్నారు. సీఎం పదవిలో ఉండి దిగజారుడు మాటలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. 2019 ఎన్నికలకు ముందు సీఎం జగన్‌ మధ్యపానంను నిషేధిస్తామని చెప్పారని, కరెంటు బిల్లులు తగ్గిస్తామని, రోడ్లు బాగు చేస్తామని ప్రజలను నమ్మించి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. రాబోయే రోజుల్లో జగన్‌కు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ, జనసేన కలయికను ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. కరెంటు బిల్లులు కట్టుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారన్నారు. ఇప్పటికైనా జగన్‌ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలన్నారు. టీడీపీ, జనసేన కూటమికి ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం పవన్‌ కళ్యాణ్‌ మీద అభిమానంతో, సిద్దాంతాలు నచ్చి 47వ డివిజన్‌ నుంచి శ్రీమంతుల కిషోర్‌ ఆధ్వర్యంలో వారి మిత్రబృందం పార్టీలో చేరారు. మనుక్రాంత్‌రెడ్డి, సుజయ్‌బాబులు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలోనే ఆ డివిజన్‌లో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

  • పవన్‌ కళ్యాణ్‌ను విమర్శించే స్థాయి జగన్‌కు లేదు: దుగ్గిశెట్టి సుజయ్‌బాబు

పవన్‌ కళ్యాణ్‌ను విమర్శించే స్థాయి సీఎం జగన్‌కు లేదని జనసేన నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్‌బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామర్లకోటలో సీఎం జగన్‌ పవన్‌ కళ్యాణ్‌ గురించి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని వైఫల్యాలపై పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడితే .. దానికి సమాధానం చెప్పకుండా ఇంట్లో ఉన్న మహిళల గురించి కించపరిచి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎంకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం జగన్‌ టిడ్కో ఇళ్లు పూర్తి చేసిన పాపాన పోలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నగరాన్ని జనసేన పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. 47వ డివిజన్‌ నుంచి కిషోర్‌ జనసేన తీర్థం పుచ్చుకోవడం అభినందనీయమన్నారు. ఈ డివిజన్‌ అధ్యక్షుడిగా కిషోర్‌ను నియమిస్తున్నామని, త్వరలోనే ఆ డివిజన్‌లో కమిటీని ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరీం, బిల్లా ఉదయ్‌, జీవన్‌, శ్రీకాంత్‌, శ్రీనివాస్‌ ముదిరాజ్‌, వినయ్‌, జీవన్‌, సాయి, మని, లోకేష్‌, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.