జోరుమీదున్న వరుణ్ తేజ్.. మరో చిత్రానికి ఓకే!

తమ ప్రతిభను ప్రదర్శిస్తూ.. కష్టపడితేనే కానీ సినిమా రంగంలో ఫలితం దక్కదన్న విషయం అందరికీ తెలిసిందే. ఎంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ అది ఒకటి, రెండు సినిమాల వరకే పనిచేస్తుంది. ఆ తర్వాత టాలెంట్, శ్రమ తోడైతేనే ఎవరైనా సరే ఇక్కడ విజయం సాధిస్తారు.

వరుణ్ తేజ్ విషయంలో కూడా అదే రుజువైంది. మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ భారీ స్థాయిలో ఉన్నప్పటికీ, తన ప్రతిభతో సక్సెస్ అవుతూ, ఈవేళ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు వరుణ్. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటున్నాడు.

ప్రస్తుతం తెలుగులో కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ‘గని’ చిత్రంలోనూ, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎఫ్ 3’ సినిమాలోనూ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త చిత్రానికి ఈ మెగా హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘గరుడ వేగ’ ఫేమ్ ప్రవీణ్ సత్తారు చెప్పిన కథ నచ్చడంతో ఆ ప్రాజక్టుకి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత భోగవల్లి ప్రసాద్ నిర్మించే ఈ చిత్రం షూటింగ్ మొత్తం లండన్ లో జరుగుతుందని సమాచారం. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు.