కమల్‌నాథ్ వ్యాఖ్యలు దురదృష్టకరం

ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ మహిళను ఉద్దేశించి మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. అటువంటి భాషను తాను ఇష్టపడనని చెప్పారు.

మధ్య ప్రదేశ్ శాసన సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఆదివారం గ్వాలియర్‌లోని డాబ్రా పట్టణంలో జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఇమారతీ దేవిని ఉద్దేశించి ‘ఐటమ్’ అని పేర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీ నుంచి పోటీ చేస్తున్న ‘ఐటమ్’లా కాకుండా కాంగ్రెస్ అభ్యర్థి సింపుల్ పర్సన్ అని వ్యాఖ్యానించారు.

ఇమారతీ దేవి, మరొక 21 మంది ఎమ్మెల్యేలు కలిసి జ్యోతిరాదిత్య సింథియాకు మద్దతుగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. వీరంతా పార్టీ మారడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది.

కమల్‌నాథ్ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. కమల్‌నాథ్ తన పార్టీ నేత అని, అయితే వ్యక్తిగతంగా తాను ఆయన ఉపయోగించిన భాషను ఇష్టపడనని చెప్పారు. అటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని చెప్పారు. ఆయనే కాదు ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా తాను ఒప్పుకోను అని రాహుల్‌గాంధీ మండిపడ్డారు.