‘మా’ తరఫున కేసీఆర్‌కు త్వరలో ఘనసన్మానం

ఇటీవల కేసీఆర్ టాలీవుడ్‌కు వరాల జల్లు కురిపించిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో  భాగంగా సి. కల్యాణ్‌ మాట్లాడుతూ.. టాలీవుడ్‌కు కేసీఆర్‌ ప్రకటించిన రాయితీలపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను త్వరలో ఘనంగా సన్మానిస్తామని నిర్మాత సి. కల్యాణ్‌ పేర్కొన్నారు. ‘థియేటర్లలో షోల పరిమితి ఉండదని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. భారతదేశంలో మొదటి సారి తెలంగాణ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. చిన్న నిర్మాతలకు బాగా ఉపయోగపడే విషయం.. జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌. దీని వల్ల ఒక చిన్న చిత్రం బాగా ఆడితే.. ఆ నిర్మాతకు సినిమాపై ఎంత డబ్బు వస్తుందో, ప్రభుత్వం నుంచి కూడా అంతే ప్రయోజనాలు కలుగుతాయి. అప్పుడు తక్కువ బడ్జెట్‌ చిత్రాలు పెరుగుతాయి. ఉద్యోగాలతో కృష్ణా నగర్‌ కలకలలాడుతుంది. జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌ ఇప్పటికే పశ్చిమ బంగాలో ఉంది’.

‘సినీ కార్మికులకు తెల్ల రేషన్‌ కార్డు ఉంటే ప్రభుత్వ సదుపాయాలు వర్తిస్తాయని కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాం. ‘ఎంత మంది ఉన్నారు’ అని అడిగారు. మేం వివరించిన వెంటనే ‘చేద్దాం’ అని చెప్పారు. ఆయన జీహెచ్‌ఎమ్‌సీ మేనిఫెస్టోలో వీటిని ప్రకటించినా.. ఇది మా చిత్ర పరిశ్రమకు ఇచ్చిన వరాలు. త్వరలోనే సినీ పరిశ్రమ తరఫున సీఎంను ఘనంగా సన్మానిస్తాం. ఇదే విషయాల్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకెళ్లి, అక్కడ కూడా అంగీకారం పొందుతామన్న నమ్మకం నాకుంది’ అని చెప్పారు. టాలీవుడ్‌ సినీ ప్రముఖుల అడుగుజాడల్లో ‘మా’ అసోసియేషన్‌ నడుస్తుందని సెక్రెటరీ జీవిత పేర్కొన్నారు. ‘మా’ తరఫున కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.