కొట్టు నైతికంగా ఓటమిని అంగీకరించినట్టే

తాడేపల్లిగూడెం: నియోజకవర్గంలో వైసిపి అభ్యర్థి కొట్టు సత్యనారాయణ నైతికంగా ఓటమిని అంగీకరించినట్టేనని జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ పేర్కొన్నారు. పెంటపాడు మండలం పెంటపాడు దర్శిపర్రు బిల్ల గుంట బోడపాడు గ్రామాల్లో బుధవారం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీలతో కలిసి తన తండ్రి బొలిశెట్టి శ్రీనివాస్ విజయం కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ తన తండ్రి బొలిశెట్టి శ్రీనివాస్ పేరు ఉన్న మరో బొలిశెట్టి శ్రీనివాసరావు బరిలోకి నిలిపి ఆ అభ్యర్థి ప్రచారాన్ని ఫోటో లేకుండా నెంబరు సింబల్ తో మాత్రమే ప్రచారం చేయించి కూటమి ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడానికి సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ఓటర్లు ఎంతో తెలివిగా ఓటు వేస్తారని వారిని మభ్య పెట్టాలనే ప్రయత్నాలు ఫలించవని స్పష్టం చేశారు. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జి మాట్లాడుతూ రౌడీ మూకలను ఆట కట్టిస్తానన్న పొలిటికల్ రౌడీ కొట్టు మంగళవారం తన నిజస్వరూపాన్ని బయటపెట్టారని పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సమయంలో కూటమి నాయకులను అరెస్టు చేయిస్తానని బెదిరించే ప్రయత్నం చేయడం దీనికి నిదర్శనం అన్నారు. ప్రజలంతా వైసీపీ కుట్రలు కుతంత్రాలను తెలుసుకొని వారిని తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని మీరు జగన్ ని తీసుకొచ్చి ప్రచారం చేయించుకున్న, డమ్మీ అభ్యర్థులను నిలబెట్టి ప్రయత్నం చేసిన మీ పప్పులు తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఓటర్ల ముందు ఉడకవని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.