కృష్ణుడి జీవితమే ఒక మానవ జీవన అనుభవసారం: గురాన అయ్యలు

విజయనగరం: కృష్ణుడి జీవితమే ఒక మానవ జీవన అనుభవసారమని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు.. మూర్తీ భవించిన వ్యక్తిత్వ వికాసమన్నారు. ఆచార్య ప్రభోదానంద యోగీశ్వరులు వారి దివ్య ఆశీస్సులతో ప్రబోధ సేవాసమితి ఆధ్వర్యంలో గురజాడ కళాభారతి ఆడిటోరియం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శాఖ అధ్యక్షులు వానపల్లి శంకరరావు ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమానికి అతిథిగా హాజరైన జనసేన నేత గురాన అయ్యలు శ్రీకృష్ణ భగవాన్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..
కృష్ణతత్వం అంటే మానవాళిని మంచి పథంలో నడిపించే ఒక డైరీ అని ఒక జీవన సారమన్నారు.. శ్రీకృష్ణుడు మానవ జీవితానికి చాలా దగ్గరగా మెలిగిన అవతారపురుషుడన్నారు. దేనికీ భయపడని వ్యక్తిత్వంతో చేపట్టిన ప్రతీ పనిలోనూ విజయం సాధించారన్నారు.. నమ్మిన వారికి కొండంత అండగా నిలిచారన్నారు.
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు రచించిన త్రైత సిద్ధాంత భగవద్గీత అందరూ చదవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ మతాన్ని నమ్ముకుని, ఇతర మతాలను గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రబోధ సేవా సమితి సభ్యులు, జనసైనికులు పాల్గొన్నారు.